Published 26 Jan 2024
ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిక్యం(Lead) సంపాదించింది. తొలి ఇన్నింగ్స్ లో ప్రత్యర్థిని 246 పరుగులకే కట్టడి చేసిన టీమ్ఇండియా(TeamIndia).. బ్యాటర్లు రాణించడంతో ఇప్పటికే స్పష్టమైన లీడ్ అందుకుంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 421 పరుగులు చేసి 175 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. 119/1తో రెండోరోజు ఇన్నింగ్స్ కంటిన్యూ చేసిన టీమ్ఇండియా.. ఆది(Starting)లోనే వికెట్ కోల్పోయింది. మరో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు జోడించి జైస్వాల్(80) ఔటయ్యాడు. గిల్(23) మరోసారి ఫెయిల్ కాగా… కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా నిలకడగా ఆడుతూనే క్రీజులో పాతుకుపోయారు.
రాహుల్, జడేజా పోరాటంతో…
ముఖ్యంగా రాహుల్(86; 123 బంతుల్లో 8×4, 2×6), రవీంద్ర జడేజా(81 నాటౌట్; 155 బంతుల్లో 7×4, 2×6) ఇంగ్లండ్ బౌలర్లను ఆటాడుకున్నారు. తొలుత రాహుల్ సెంచరీ దిశగా సాగినా ఆ కల నెరవేరకుండా పెవిలియన్ దారి పట్టాడు. అటు శ్రేయస్ అయ్యర్(35) ఔటైన తర్వాత క్రీజులోకొచ్చిన జడేజాతో రాహుల్… మంచి పార్ట్నర్ షిప్ ఉండేలా చూసుకున్నాడు. కానీ చివర్లో రెహాన్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టాప్ ఆర్డర్ వికెట్లు పడ్డా మరో ఎండ్ లో రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. ఆల్ రౌండర్ గా తన విలువేంటో చాటిచెబుతూ ఇన్నింగ్స్ ను ముందుండి నడిపించాడు.
జడ్డూ ఆల్ రౌండ్ షో…
ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడంలో మూడు వికెట్లతో ముఖ్య పాత్ర వహించిన జడేజా.. బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు. రాహుల్ ఔటైన తర్వాత బ్యాటింగ్ కు దిగిన వికెట్ కీపర్ శ్రీకర్ భరత్(41)తో కలిసి ఇంగ్లండ్ బౌలర్లకు జడేజా విసుగు తెప్పించాడు. అటు భరత్ సైతం చాలా రోజుల తర్వాత బ్యాట్ కు పనిచెప్పాడు. రవిచంద్రన్ అశ్విన్(1) పరుగుకే అనూహ్యంగా రనౌటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, టామ్ హార్ట్ లీ చెరో రెండేసి… జాక్ లీచ్, రెహాన్ అహ్మద్ ఒక్కోటి చొప్పున వికెట్ తీసుకున్నారు. మొత్తంగా రెండోరోజు రోహిత్ సేన ఇంగ్లండ్ పై సంపూర్ణ ఆధిపత్యం(Domination) చూపించింది.