PHOTO: THE TIMES OF INDIA
ఆసియా క్రీడల్లో(Asian Games)లో భారత్ పతాక మరోసారి రెపరెపలాడింది. నిన్న ఈక్వస్ట్రియన్ లో పసిడి పతకం రాగా.. తాజాగా రైఫిల్స్ విభాగంలోనూ రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. రైఫిల్స్ విభాగంలోనే ఈ రోజు నాలుగు పతకాలు భారత్ సొంతమయ్యాయి. 50 మీటర్ల అంశంలో ప్రపంచ రికార్డు బద్ధలు కొడుతూ సిఫ్ట్ కౌర్ సమ్రా సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరల్డ్ రికార్డే కాకుండా ఆసియా రికార్డు, ఏషియన్ గేమ్స్ లో సరికొత్త చరిత్రను సృష్టించింది. 50 మీటర్ల సింగిల్స్ లో సమ్రా గోల్డ్ సాధిస్తే ఆషి ఛౌక్సీ కాంస్య పతకం(Bronze Medal) మెడలో వేసుకుంది.
మహిళల ఈవెంట్ లోనూ పసిడి పతకం
ఇక మహిళల 25 మీటర్ల షూటింగ్ టీమ్ ఈవెంట్ లోనూ భారత జట్టు బంగారు పతకాన్ని ముద్దాడింది. మనుభాస్కర్, ఈషా సింగ్, రిథమ్ సంగ్వాన్ తో కూడిన టీమ్ చైనాను వెనక్కు నెట్టి బంగారు పతకాన్ని సాధించింది. ఈ త్రయం 1,759 పాయింట్లు సాధించగా, 1,756 పాయింట్లతో చైనా, 1,746 పాయింట్లతో సౌత్ కొరియా రెండు, మూడు స్థానాల్లో నిలిచి సిల్వర్, బ్రాంజ్ మెడల్ ను అందుకున్నాయి. ఇక మహిళల 50 మీటర్ల ఈవెంట్ లోనూ ముగ్గురు క్రీడాకారిణిలతో కూడిన టీమ్ సెకండ్ ప్లేస్ లో నిలిచి సిల్వర్ మెడల్ అందుకుంది. వ్యక్తిగతంగా గోల్డ్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన సమ్రా, ఛౌక్సీలతోపాటు మానిని కౌశిక్ తో కూడిన బృందం రజత పతకాన్ని సొంతం చేసుకుంది. 1,773 పాయింట్లతో చైనా జట్టు బంగారు పతకాన్ని అందుకోగా.. 1,764 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 1,756 పాయింట్లతో దక్షిణ కొరియా థర్డ్ ప్లేస్ ఆక్రమించింది.