
Published 15 Jan 2024
ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు పెద్ద జట్ల పోరాటంతో హోరెత్తనున్న ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ వీక్షించేందుకు గాను టికెట్ల విక్రయాలు మొదలు పెడుతున్నారు. అయితే విద్యార్థులు, సైనికుల కుటుంబాలకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు HCA అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. టికెట్ల అమ్మకాలపై HCA కార్యవర్గంతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఏయే తేదీల్లో విక్రయాలు జరపాలన్న దానిపై క్లారిటీ ఇచ్చారు.
ఇన్ సైడర్ లో…
ఈ నెల 25 నుంచి భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. పేటీఎం(Paytm) ఇన్ సైడర్(www.insider.in వెబ్ సైట్)లో ఈ నెల 18 నుంచి టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. 18న రాత్రి 7 గంటల నుంచి పేటీఎం ఇన్ సైడర్ మొబైల్ యాప్ లోనూ ఇవి దొరుకుతాయి. ఇక ఈ నెల 22న అంటే మ్యాచ్ కు మూడు రోజుల ముందు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో ఆఫ్ లైన్(Offline) టికెట్ల విక్రయాలు జరుగుతాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) తెలిపింది. ఈ మ్యాచ్ ను ప్రత్యేకంగా వీక్షించేందుకు గాను విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తున్నారు. మొత్తం 25,000 మంది పిల్లల(Students)కు కాంప్లిమెంటరీ పాస్ లు అందిస్తుండగా.. వారందరికీ ఉచిత భోజనం కూడా ఇస్తామని HCA ప్రకటించింది. ఇక గణతంత్ర దినోత్సవం(Republic Day) నాడు భారత సాయుధ దళాల(Army Personnal) కుటుంబాలకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని తెలిపింది.
ఐడెంటిటీ కార్డు తప్పనిసరి…
ఆన్ లైన్(Online)లో టికెట్లు బుక్ చేసుకున్న వ్యక్తులు తమ గుర్తింపు కార్డు(Identity Cards)లు చూపించాల్సి ఉంటుందని HCA స్పష్టం చేసింది. టికెట్లు పొందినవారంతా 22వ తేదీ నుంచి ఏదైనా ప్రభుత్వ కార్డుతో టికెట్లను రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
స్కూల్స్ చేయాల్సినవివే…
- ఇప్పటివరకు 300 పాఠశాలల నుంచి HCAకు లెటర్లు అందాయి.
- స్టూడెంట్స్ పేర్లు, క్లాస్, యూనిఫామ్స్ తో ఐడీ కార్డు పంపాలి.
- స్టేడియంలోకి వచ్చాక పిల్లల బాధ్యత స్కూల్ దే.
- పాస్ ల కోసం HCA వర్గాలను సంప్రదించడం… లెటర్లు పంపడం చేయాలి.