ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా కోల్పోయిన గుజరాత్ టైటాన్స్(GT)… తన పోరాటం ఇంకా ఉందంటూ చెన్నై సూపర్ కింగ్స్(CSK)కి చుక్కలు చూపించింది. సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ ఓపెనింగ్ జోడీ చెన్నై బౌలర్లను ఉతికి ఆరేయడంతో ఆ టీమ్ భారీ స్కోరు చేసింది. సిక్స్ లు ఇంత సులువా అన్న రీతిలో ఎడాపెడా బంతుల్ని బౌండరీ అవతలికి తరలించి సెంచరీలతో హడలెత్తించారు. చివరి నాలుగు ఓవర్లలో పెద్దగా రన్స్ రాకపోవడంతో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది టైటాన్స్.
టాస్ ఓడినా…
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు ఊహించని రీతిలో శుభారంభం లభించింది. తొలి ఓవర్ నుంచే గిల్, సుదర్శన్ విజృంభణ మొదలైంది. గిల్ 25 బాల్స్ లో, సుదర్శన్ 32 బంతుల్లో 50 మార్క్ చేరుకున్నారు. 9.3 ఓవర్లలో 100, 12.4 ఓవర్లలో 150 కంప్లీట్ చేసింది టైటాన్స్ టీమ్. ఒకరిని మించి ఒకరన్నట్లుగా ఇద్దరూ 200 స్ట్రైక్ రేట్(Strike Rate)కు పైగానే రన్స్ తీశారు.
ఎంత ట్రై చేసినా…
ఈ ఇద్దర్నీ విడదీయడానికి చెన్నై బౌలర్లు ఎంత ట్రై చేసినా లాభం లేకుండా పోయింది. గిల్, సాయి ధాటికి 16.2 ఓవర్లలోనే గుజరాత్ 200 స్కోరు దాటింది. అచ్చంగా ఈ ఇద్దరూ 50 బంతుల్లోనే 100 దాటడం విశేషంగా నిలిచింది. సెంచరీ పూర్తయిన వెంటనే సుదర్శన్(103; 51 బంతుల్లో 5×4, 7×6), గిల్(104; 55 బంతుల్లో 9×4, 6×6) ఔటయ్యారు.