
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆర్చరీ(Archery) మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. కేవలం ఒకే ఒక పాయింట్ తో ప్రత్యర్థిని రెండో స్థానానికి నెట్టింది. దీంతో ఆసియా క్రీడల(Asian Games) ఆర్చరీలో మరో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది. టీమ్ కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నం, ఆదితి స్వామి, పర్ణీత్ కౌర్ లతో కూడిన టాప్ సీడ్ ఘన విజయాన్ని అందుకుంది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అయిన ఈ త్రయం.. చైనీస్ తైపీకి చెందిన ప్లేయర్స్ ను 230-229 తేడాతో అధిగమించి గోల్డ్ మెడల్ సాధించారు. బుధవారం నాడు కాంపౌండ్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో జ్యోతి, ఓజాస్ డియోటాలే స్వర్ణం గెలిచిన తర్వాత ఆసియా క్రీడల్లో దక్కిన రెండో బంగారు పతకమిది.
సింధుపై ప్రతీకారం తీర్చుకున్న బింగ్ జియావో
రెండు సార్లు ఒలింపిక్స్ విజేత, భారత షట్లర్ పి.వి.సింధుకు నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ లో చైనాకు చెందిన హీ బింగ్ జియావో చేతిలో ఓటమి పాలైంది. 15వ ర్యాంక్ లో ఉన్న సింధు.. ప్రపంచ ఐదో ర్యాంకర్ చేతిలో 16-21, 12-21 తేడాతో పరాజయం పాలైంది. కేవలం 47 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం, సింధు నుంచి పోరాటమే లేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. టోక్యో ఒలింపిక్స్ లో వరుస గేమ్ ల్లో బింగ్ జియావోను సింధు ఓడించగా.. ఇప్పుడు అందుకు ప్రతిగా ఈ చైనా ప్లేయర్ సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. సింధు గత రెండు ఏషియన్ గేమ్స్ లోనూ కాంస్య, రజత పతకాలకే పరిమితమతవగా… ఈసారి క్వార్టర్స్ లోనే వెనుదిరిగింది. 2014 ఇంచియాన్ గేమ్స్ లో కాంస్య(Bronze), 2018 జకార్తా క్రీడల్లో రజత(Silver) పతకాలను సింధు సొంతం చేసుకుంది.