మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో తెలంగాణ యువతి గొంగడి త్రిష జోరు కొనసాగుతూనే ఉంది. ఈ ఫార్మాట్లో సెంచరీ చేసి ఏకైక మహిళగా నిలిచిన ఆమె.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోనూ సత్తా చాటింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా(South Africa) బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత బౌలర్ల ధాటికి 80 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఇందులో త్రిష దెబ్బకు కెప్టెన్ రీణెకె(7), నిలదొక్కుకున్న ఏకైక ప్లేయర్ మీకే వాన్(23), చివర్లో శెష్నీ నాయుడు(0) ఔటయ్యారు. టీమ్ఇండియా మహిళల ధాటికి సౌతాఫ్రికా కోలుకోలేని విధంగా 82 పరుగులకే ఆలౌట్ అయింది.
జనవరి 28న స్కాట్లాండ్ తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచులో 59 బంతుల్లోనే 110 పరుగులు చేసిన త్రిష.. బౌలింగ్ లోనూ రాణించి మూడు వికెట్లు తీసుకుంది. ఆమె బ్యాటింగ్ ఈ టోర్నీకే హైలెట్ కాగా… ఫైనల్లోనూ మంచి ప్రదర్శన కనబర్చడంతో దక్షిణాఫ్రికా కోలుకోలేకపోయింది. ఈ ఫైనల్లో భారత బౌలర్లలో త్రిషనే అత్యధిక వికెట్లు తీసుకుంది. ఆ టీమ్ లో నలుగురు డకౌట్ కాగా, ఒక్కరు మాత్రమే 20 స్కోరు దాటారు.