హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్ ధనాధన్ తోపాటు నలుగురు బ్యాటర్ల హాఫ్ సెంచరీలతో దక్షిణాఫ్రికా హడలెత్తిస్తే.. ఇంగ్లండ్ మాత్రం టపటపా వికెట్లు రాల్చుకుని ఘోర పరాజయం పాలైంది. క్లాసెన్ ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తే, జాన్సన్ ఆల్ రౌండ్ షో(All Round Show)తో అదరగొట్టాడు. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 399 రన్స్ చేయగా.. అందుకు భిన్నంగా ఇంగ్లిష్ టీమ్ 100 స్కోరుకు వచ్చేసరికి 8 వికెట్లు చేజార్చుకుంది. 22 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌట్ అయి 229 రన్స్ తేడాతో అవమానకర రీతిలో పరాజయాన్ని మూటగట్టుకుంది.
నలుగురు సౌతాఫ్రికా బ్యాటర్ల విధ్వంసం
వరుస సెంచరీల హీరో క్వింటన్ డికాక్(4) ఈ మ్యాచ్ లో ఫెయిలయినా ఇంగ్లండ్ పై దక్షిణాఫ్రికా పూర్తి ఆధిపత్యం(Domination) ప్రదర్శించింది. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(85; 75 బంతుల్లో 9×4, 3×6), ఫస్ట్ డౌన్ బ్యాటర్ వాండెర్ డసెన్(60; 61 బంతుల్లో 8×4) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేయడంతో ఆ టీమ్ కు శుభారంభం లభించింది. రెండో వికెట్ కు ఈ ఇద్దరు 124 రన్స్ పార్ట్నర్ షిప్ నమోదు చేశారు. డసెన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మార్ క్రమ్ సైతం(42; 44 బంతుల్లో 4×4) వేగంగా ఆడాడు. మార్ క్రమ్ ఔట్ అయిన తర్వాత మొదలైంది అసలు తుపాను. క్లాసెన్(109; 67 బంతుల్లో 12×4, 4×6), జాన్సన్(75; 42 బంతుల్లో 3×4, 6×6) ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది.
అవమానకర రీతిలో డిఫెండింగ్ ఛాంపియన్
8 రన్ రేట్ తో బ్యాటింగ్ సాగించాల్సిన ఇంగ్లండ్.. పసికూన తరహాలో ఏ మాత్రం ప్రభావం చూపకుండా అసలు పోటీలోనే లేనన్నట్లుగా ఆడింది. బెయిర్ స్టో(10), మలన్(6), రూట్(2), స్టోక్స్(5), బ్రూక్(17), బట్లర్(15), డేవిడ్ విల్లే(12), రషీద్(10) ఇలా ఫేమస్ బ్యాటర్లు అని చెప్పుకునే వారంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం దిశగా సాగిన స్థితిలో అట్కిన్సన్, మార్క్ వుడ్ ఆదుకుని పరువు నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయినా ఇంగ్లండ్ సగం ఓవర్లు ఆడకుండానే చాప చుట్టేసింది. కోయెట్జీ 3, జాన్సన్ 2, ఎంగిడి 2 వికెట్లు తీసుకున్నారు. ఇప్పటికే ఒక గెలుపు, రెండు పరాజయాలతో పాయింట్స్ టేబుల్ లో 6వ ప్లేస్ లో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. ఈ ఓటమితో మరింత కిందకు పడిపోయింది.