ప్రపంచ క్రీడల్లో అగ్రగామిగా భావించే ఒలింపిక్స్(olympics)… కుదిరితే 2036లో మన దగ్గర నిర్వహించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అయితే అంతకుముందే కామన్వెల్త్ గేమ్స్ జరపాలన్న ఆలోచన ఉంది. 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు యత్నిస్తున్న గుజరాత్ సర్కారు.. ఇప్పట్నుంటే సదుపాయాలపై దృష్టి పెట్టింది. ఈలోపు 2026 కామన్వెల్ గేమ్స్ కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇచ్చేలా బిడ్ వేసి.. అనుకూలిస్తే ఆ క్రీడల్ని నిర్వహించాలని చూస్తోంది. కామన్వెల్త్ గేమ్స్ వెచ్చింపుల్ని చూసి ఆస్ట్రేలియాలోని విక్టోరియా.. 2026 బిడ్ నుంచి తప్పుకుంది. ఒకవేళ 2026 గేమ్స్ కుదరకపోతే 2030 గేమ్స్ నైనా తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. 2030 కామన్వెల్త్ గేమ్స్ బిడ్ దక్కుతుందన్న భావనతో 2028 నాటికే అన్ని సౌకర్యాలు పూర్తి చేయనుంది.
సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఒలింపిక్స్ క్రీడల నిర్వహణపై ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు ఒలింపిక్స్ కు సన్నాహాలుగా భావించే అన్ని కార్యక్రమాలపై BJP పెద్దలు సైతం గుజరాత్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు వివరాలు అడుగుతున్నారు. 2026 కామన్వెల్త్ గేమ్స్ నుంచి విక్టోరియా తప్పుకోవడంతో.. కేంద్ర ప్రభుత్వం అండతో ఆ బిడ్ ను తాను దక్కించుకోవడానికి గుజరాత్ శతథా యత్నిస్తోంది. అహ్మదాబాద్ ఒలింపిక్స్ బిడ్ కోసం ఆస్ట్రేలియాకు చెందిన పాప్యులస్(populous) కంపెనీ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంతోపాటు నరేంద్ర మోదీ స్టేడియంలో ఒలింపిక్స్ నిర్వహించాలన్న అభిప్రాయంతో గుజరాత్ ఉంది.