భారత హాకీ జట్టు ఒలింపిక్స్ పతకాన్ని ముద్దాడింది. కాంస్య(Bronze) పతకం కోసం జరిగిన మ్యాచ్ లో స్పెయిన్ పై 2-1 తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. తొలుత స్పెయిన్ కెప్టెన్ మార్క్ మిరేల్స్ 18వ నిమిషంలో మొదటి గోల్ అందించాడు. ఆ తర్వాత 30వ నిమిషంలో భారత్ సైతం గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది.
కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 33వ నిమిషంలోనూ రెండో పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచాడు. చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న గోల్ కీపర్ శ్రీజేశ్.. ప్రత్యర్థి గోల్స్ ను సమర్థంగా అడ్డుకున్నాడు. ‘ద గ్రేట్ ఇండియన్ వాల్ ఆఫ్ ఇండియన్ హాకీ’గా పిలుచుకునే శ్రీజేశ్.. ఈ మ్యాచ్ తో 18 ఏళ్ల కెరీర్ కు ముగింపు పలికాడు. గత టోక్యో ఒలింపిక్స్ లో టీమ్ఇండియా కాంస్య పతకాన్ని అందుకుంది.