హైదరాబాద్ సన్ రైజర్స్(SRH) ప్లేయర్లు మరోసారి రెచ్చిపోయారు. మొన్న ముంబయి.. నేడు బెంగళూరు అన్నట్లు ఊచకోత కోశారు. బాల్ బ్యాట్ కు తాకిందంటే అయితే ఫోర్ లేదా సిక్స్ అన్నట్లుగా సాగింది ఇన్నింగ్స్. ముఖ్యంగా ఓపెనర్ ట్రావిస్ హెడ్ పెను విధ్వంసమే(Blasting) సృష్టించాడు. క్లాసెన్ క్లాసికల్ ఇన్నింగ్స్ కు తోడు వచ్చిన వాళ్లంతా వీరబాదుడుకు దిగడంతో బెంగళూరు బేజారైపోయింది.
స్కోరు చకచకా…
సన్ రైజర్స్ ఆటగాళ్ల జోరు మామూలుగా లేదు మరి. ఓపెనర్ ట్రావిస్ హెడ్(102; 41 బంతుల్లో 9×4, 8×6) సెంచరీ చేస్తే… ఆ 102 స్కోరులో 84 రన్స్ ఫోర్లు, సిక్స్ ల ద్వారా వచ్చినవే ఉన్నాయి. 20 బాల్స్ లోనే హెడ్ ఫిఫ్టీ చేస్తే, 4.3 ఓవర్లలోనే హైదరాబాద్ స్కోరు 50 దాటింది. 11.2 ఓవర్లలో 150 మార్క్ ను రీచ్ కాగా.. హెడ్, అభిషేక్ శర్మ(34; 22 బంతుల్లో 2×4, 2×6) జోడీ 43 బాల్స్ లోనే సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసింది. ఇతడు ఔటయ్యాక వచ్చింది మరో విధ్వంసం క్లాసెన్(67; 31 బంతుల్లో 2×4, 7×6) రూపంలో.
భారీ భాగస్వామ్యాలు…
హెడ్, అభిషేక్ జంట 100 పరుగులు జోడిస్తే రెండో వికెట్ కు ట్రావిస్, క్లాసెన్ 23 బంతుల్లోనే 50 దాటించారు. మొత్తంగా సన్ రైజర్స్ ఆటగాళ్ల దూకుడుతో ఆ జట్టు మరోసారి రికార్డు స్థాయి స్కోరు చేసింది. చివర్లో మార్ క్రమ్(32; 17 బంతుల్లో 2×4, 2×6), అబ్దుల్ సమద్(37; 10 బంతుల్లో 4×4, 3×6) ముంబయిపై 277 పరుగుల రికార్డును తుడిచిపెడుతూ మరో 10 పరుగులు అదనంగా జత చేసి 287/3 చేసింది.