సొంతగడ్డపై హైదరాబాద్(HSR) తిరుగులేని రీతిలో ఆడుతున్నది. తమ వద్దకు వస్తే ఎంత పెద్ద జట్టయినా చిన్నబోవాల్సిందేనన్న రీతిలో దుమ్మురేపుతోంది. మొన్న ముంబయిని దారుణంగా ఓడించిన సన్ రైజర్స్.. ఈరోజు చెన్నైని అలాగే చేసింది. కోల్ కతా చేతిలో ఈడెన్ గార్డెన్స్ లో, గుజరాత్ చేతిలో అహ్మదాబాద్ లో ఓటమి పాలైన హైదరాబాద్.. సొంతగడ్డపై మాత్రం రెచ్చిపోతున్నది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్లకు 165 పరుగులు చేస్తే.. 11 బంతులు మిగిలి ఉండగానే 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసి 6 వికెట్లతో హైదరాబాద్ విజయం దక్కించుకుంది.
చెన్నై టీమ్ లో…
భారీ స్కోరు చేసే ఛాన్సెస్ ఉన్నా చెన్నై టాప్, మిడిలార్డర్ గట్టిగా నిలబడలేక అది సాధ్యపడలేదు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర(12), రుతురాజ్ గైక్వాడ్(26) ఇద్దరూ వెనుదిరిగిన తర్వాత అజింక్య రహానే(35; 30 బంతుల్లో 2×4, 1×6), శివమ్ దూబె(45; 24 బంతుల్లో 2×4, 4×6) జోడీ ఆదుకుంది. ముఖ్యంగా దూబె దంచికొట్టగా హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో కమిన్స్ బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చాడు. చివర్లో రవీంద్ర జడేజా(31 నాటౌట్; 23 బంతుల్లో 4×4), డారిల్ మిచెల్(13), ధోని(1 నాటౌట్)తో CSK 165/5 వద్దే ఆగిపోయింది.
అభి’షేక్’…
సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ(37; 12 బంతుల్లో 3×4, 4×6) మరోసారి ప్రత్యర్థిని షేక్ చేశాడు. గత నెల 27న ముంబయితో జరిగిన మ్యాచ్ లో 23 బంతుల్లోనే 63 రన్స్ చేసిన అతడు ఈ మ్యాచ్ లోనూ అదే ఆటతీరు చూపించాడు. అభిషేక్ ఔటైనా ట్రావిస్ హెడ్(31; 24 బంతుల్లో 3×4, 1×6), మార్ క్రమ్(50; 36 బంతుల్లో 4×4, 1×6) నిలబడ్డారు. ఈ ఇద్దరూ సెకండ్ వికెట్ కు 64 పరుగుల పార్ట్నర్ షిప్ ఇచ్చారు. క్లాసెన్(10 నాటౌట్), నితీశ్ కుమార్(14 నాటౌట్) ముగింపునిచ్చారు. పెద్ద టార్గెట్ కాకపోవడంతో సన్ రైజర్స్ ఆడుతూ పాడుతూ ఇన్నింగ్స్ సాగించింది.