38 సిక్స్ లు నమోదైన మ్యాచ్.. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియాన్ని ఉర్రూతలూగించింది. ఇరు జట్ల బ్యాటర్లు కొదమసింహాల్లా విరుచుకుపడటంతో ఐపీఎల్ మ్యాచ్ లో భారీ స్కోర్లు రికార్డయ్యాయి. తొలుత బ్యాటింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దడదడలాడిస్తే.. ఆ తర్వాత ముంబయి ఇండియన్స్ కూడా పోటీలోనే ఉన్నానంటూ చాటిచెప్పింది. కానీ భారీ టార్గెట్ ను చేరుకోలేక చేతులెత్తేసింది. టాస్ ఓడిన సన్ రైజర్స్ తొలుత 3 వికెట్లకు 277 పరుగులు చేసింది. అనంతరం ముంబయి.. 5 వికెట్లకు 246 వద్దే ఆగిపోయి 31 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.
హైదరా’బాద్ షా’లు…
ఓపెనర్ మయాంక్ అగర్వాల్(11) ఒక్కడే తక్కువ స్కోరుకు ఔట్ కాగా.. ట్రావిస్ హెడ్(62; 24 బంతుల్లో 9×4, 3×6), అభిషేక్ శర్మ(63; 23 బంతుల్లో 3×4, 7×6), మార్ క్రమ్(42; 28 బంతుల్లో 2×4, 1×6), క్లాసెన్(80 నాటౌట్; 34 బంతుల్లో 4×4, 7×6) ఊచకోత కోశారు. ఈ మ్యాచ్ లో మొత్తం 18 సిక్స్ లు, 19 ఫోర్లు నమోదయ్యాయంటే బ్యాటింగ్ సాగిన తీరును అర్థం చేసుకోవచ్చు.
ముంబయి సైతం…
278 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబయికి ఓపెనర్లు రోహిత్ శర్మ(26; 12 బంతుల్లో 1×4, 3×6), ఇషాన్ కిషన్(34; 13 బంతుల్లో 2×4, 4×6) జంట ఫస్ట్ వికెట్ కు 56 పరుగులు జోడించింది. ఇషాన్ హిట్టింగ్ తో 3 ఓవర్లలోనే ముంబయి స్కోరు 50కి చేరుకుంది. కానీ ఇషాన్, ఆ తర్వాత రోహిత్ ఔట్ కావడంతో ముంబయి కష్టాల్లో పడ్డట్లు కనిపించింది. కానీ నమన్ ధిర్(30; 14 బంతుల్లో 2×4, 2×6), తిలక్ వర్మ(64; 34 బంతుల్లో 2×4, 6×6) ముందుండి నడిపించే ప్రయత్నం చేశారు. కానీ హైదరాబాద్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ముంబయి ఓటమి పాలైంది.
అత్యధికం…
11 ఏళ్ల నాటి రికార్డును సన్ రైజర్స్ బద్ధలు కొట్టింది. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెలకొల్పిన 263/5 రికార్డును హైదరాబాద్ టీమ్ తుడిచిపెట్టింది. రెండు జట్లు తొలి 10 ఓవర్లలో సాధించిన రన్స్ మొత్తం 289. ఇక 277 స్కోరు ప్రపంచ టీ20 చరిత్రలో మూడో హయ్యెస్ట్ గా నిలిచింది. 2023 సెప్టెంబరు 27న మంగోలియాతో జరిగిన మ్యాచ్ లో నేపాల్ టీమ్ 3 వికెట్లకు 314 రన్స్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత అఫ్గానిస్థాన్ ఐర్లాండ్ పై 278/3తో.. చెక్ రిపబ్లిక్ టీమ్ టర్కీపై 278/4 స్కోరు చేసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి.