అతను క్రీజులోకి దిగాడంటే ఎదురుగా ఉన్నది ఏ బౌలరైనా సరే.. వీరబాదుడే. అతడు కొద్దిసేపు అతుక్కుపోయాడంటే.. ఇక ఔట్ చేయడం గగనమే. డాషింగ్ ఓపెనర్ గా భారత క్రికెట్ చరిత్రకే కొత్త గుర్తింపు తెచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ కు.. ICC ప్రత్యేక గౌరవాన్ని కల్పించింది. క్రికెట్ కు విశేష సేవలందించిన ఇతడితోపాటు మహిళా క్రికెటర్ కు ICC నుంచి అరుదైన గౌరవం లభించింది. వీరంద్ర సెహ్వాగ్, మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ హాల్ ఆప్ ఫేమ్-2023(Hall Of Fame)లో చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరితోపాటు శ్రీలంక మాజీ క్రికెటర్ అరవింద డిసిల్వాకు సైతం చోటు సంపాదించాడు. ఈ మేరకు ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్(ICC) తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది.
ఇప్పటికీ అదే హయ్యెస్ట్ స్కోర్
ముంబయిలో ఈ నెల 15న భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ సందర్భంగా ఈ ముగ్గురిని ICC సన్మానించనుంది. 104 టెస్టులాడిన సెహ్వాగ్.. 23 సెంచరీలతో 8,586 పరుగులు చేశాడు. టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ(319) చేసిన భారత ఆటగాడిగా నిలవగా.. 2008లో సౌతాఫ్రికాపై సాధించిన ఈ స్కోరే ఇప్పటివరకు హయ్యెస్ట్ గా నిలిచింది. 251 వన్డేలాడి 15 సెంచరీలతో 8,273 పరుగులు చేయగా.. టెస్టులు, వన్డేల్లో కలిపి 136 వికెట్లను సెహ్వాగ్ తీసుకున్నాడు. 20 టెస్టుల్లో 63, 34 వన్డేల్లో 46 వికెట్లు తీసుకున్న డయానా ఎడుల్జీ.. ఆల్ రౌండర్ గా సేవలందించింది. 1983లో ఆమెకు అర్జున అవార్డు రాగా.. 2002లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. శ్రీలంక క్రికెట్ కు దిశ, దశ చూపిన డిసిల్వా 93 టెస్టుల్లో 6,361, 308 వన్డేల్లో 9,284 పరుగులు చేశాడు. టెస్టుల్లో 29, వన్డేల్లో 126 వికెట్లు తీసుకున్నాడు.