Published 24 Jan 2024
మూస ధోరణితో కొనసాగుతూ మ్యాచ్ అంటేనే చికాకుగా మారిన టెస్టుల్లో బజ్ బాల్(Bazball) ఆటతీరుతో కొత్త పంథా(Style)ను నింపిన ఇంగ్లండ్… అదే ఆటతీరుతో చాలాసార్లు బోల్తా పడింది. స్పీడ్ గా ఆడాలన్న లక్ష్యంతో వికెట్లన్నీ చేజార్చుకుని పరాజయం పాలయ్యారు బ్రిటిష్ ప్లేయర్లు. అయినా సరే బజ్ బాల్ గేమ్ విషయంలో తగ్గేది లేదంటున్నారు ఇంగ్లండ్ ఆటగాళ్లు. మరి భారత్ తో ఈ రోజు ప్రారంభమయ్యే తొలి టెస్టులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాల్సి ఉంది. ఇంగ్లండ్ టీమ్ బజ్ బాల్ ను నమ్ముకుంటే.. స్పిన్నే అస్త్రంగా బరిలో అడుగుపెడుతున్నది టీమ్ఇండియా. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది.
ఆ ముగ్గురు లేకుండానే…
సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే లేకుండా తొలిసారి భారత జట్టు టెస్టులాడుతున్నది. పుజారా ఇక టీమ్ లోకి ఎంటరయ్యేది అనుమానంగా మారితే.. ఈ 5 టెస్టుల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లకు కోహ్లి అందుబాటులో ఉండటం లేదు. కుటుంబ కారణాల రీత్యా తొలి రెండు టెస్టుల్లో విరాట్ ఆడబోడని ఇప్పటికే BCCI ప్రకటించింది. కోహ్లి గైర్హాజరీలో శుభ్ మన్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు రానున్నాడు. గిల్ టాలెంట్ విషయంలో ఎలాంటి సందేహాలు లేకున్నా.. గత 20 టెస్టుల్లో అతడి సగటు(Average) 30.58గా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. గత ఇంగ్లండ్ సిరీస్ లో అతడు 19.83 యావరేజ్ తో రన్స్ సాధిస్తే ఏడు ఇన్నింగ్స్ ల్లో 5 సార్లు ఫాస్ట్ బౌలర్లకు దొరికిపోయాడు.
వికెట్ కీపర్ అతడేనా..
చాలా రోజుల తర్వాత స్పెషలిస్ట్ బ్యాటర్ గా కేఎల్ రాహుల్ ఆడబోతున్నాడు. స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల్లో కీపింగ్ చేసిన కేఎస్ భరత్.. ఏ మాత్రం రాణించలేకపోయాడు. దీంతో ఈ సిరీస్ లో ప్లేస్ కోసం ధ్రువ్ జురెల్ తో భరత్ పోటీ పడాల్సి వస్తున్నది. అయితే సీనియారిటీ పరంగా చూస్తే భరత్ కే ఎక్కువ అవకాశాలున్నట్లు కనపడుతోంది.