
Published 24 Dec 2023
తొలి ఇన్నింగ్స్ లో 3, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లతో స్నేహ్ రాణా అదరగొట్టడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత మహిళల(Indian Women) జట్టు ఘన విజయం సాధించింది. స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ అలవోకగా గెలుపును సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 219 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 406 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో కంగారూ జట్టు 261 రన్స్ కే కుప్పకూలడంతో భారత్ ఎదుట 75 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కేవలం 18.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి భారత వుమెన్ టీమ్ విజయాన్ని సాధించింది.
ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. పూజా వస్త్రాకర్ 4, స్నేహ్ రాణా 3, దీప్తి శర్మ 2 వికెట్లతో రాణించడంతో ఆసీస్ ను తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే కుప్పకూల్చిన భారత్.. నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడంతో 406 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీప్తి శర్మ(78), స్మృతి మంధాన(74), జెమీమా రోడ్రిగ్స్(73), రిచా ఘోష్(52) నిలకడగా ఆడుతూ భారత్ భారీ స్కోరుకు బాటలు వేశారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్నర్ 4 వికెట్లు తీసుకుంది.
తొలి ఇన్నింగ్స్ లో 187 రన్స్ వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా.. మెక్ గ్రాత్(73), ఎలిసా పెర్రీ(45) రాణించినా మిగతావాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో 261కే 10 వికెట్లు చేజార్చుకుంది. స్నేహ్ రాణా 4, రాజేశ్వరి గైక్వాడ్ 2, హర్మన్ ప్రీత్ కౌర్ 2 వికెట్లు తీసుకోవడంతో ఆసీస్ కంటిన్యూగా వికెట్లు కోల్పోయింది. రెండు ఇన్నింగ్స్ ల్లో ఆస్ట్రేలియా వెన్నువిరిచిన స్నేహ్ రాణా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకుంది.