Published 31 Dec 2023
వరుసగా రెండో మ్యాచ్ లోనూ బోల్తా పడ్డ భారత మహిళల జట్టు(Women Team).. మూడు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియాకు అప్పగించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 42 బంతుల్లో 48 రన్స్ చేయాల్సిన దశలో 6 వికెట్లు చేతిలో ఉన్నా టార్గెట్ ను మాత్రం ఛేదించలేకపోయారు అమ్మాయిలు. రిచా ఘోష్(96; 117 బంతుల్లో, 13×4) తృటిలో సెంచరీ చేజార్చుకోవడంతోపాటు చివరి వరకు నిలవలేకపోవడంతో మ్యాచ్ ను ప్రత్యర్థికి అప్పగించాల్సి వచ్చింది. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టెయిలెండర్లు తడబడ్డ భారత్.. మ్యాచ్ తోపాటే సిరీస్ ను ప్రత్యర్థికి అప్పగించాల్సి వచ్చింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన కంగారూ జట్టు.. ఓపెనర్ లిచ్ ఫీల్డ్(63), ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఎలిసే పెర్రీ(50) రాణించడంతో 8 వికెట్లకు 258 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లకు 255 పరుగుల వద్ద ఆగిపోయింది. రిచా ఘోష్, అమన్ జ్యోత్, వస్త్రాకర్, డియోల్ వెంటవెంటనే అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. 10 మందిలో రిచాకు సహకరించేవారే లేకపోయారు. జెమీమా రోడ్రిగ్స్(44), స్మృతి మంధాన(36) కొద్ది సేపు నిలబడ్డా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5) రాణించలేకపోయింది. ఈ నెల 28న జరిగిన తొలి మ్యాచ్ లోనూ భారత మహిళల టీమ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.