Published 13 Dec 2023
ఫస్ట్ మ్యాచ్ మాదిరిగానే రెండో టీ20కి వర్షం అడ్డుపడటంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం దక్షిణాఫ్రికా(South Africa) విజేతగా నిలిచింది. తొలి ముగ్గురు బ్యాటర్లు తడబడ్డా కెప్టెన్ సూర్యకుమార్(56; 36 బంతుల్లో 5×4, 3×6), రింకూ సింగ్(68; 39 బంతుల్లో 9×4, 2×6) క్రీజుకు అతుక్కుపోవడంతో భారత్(India) నిర్ణీత 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. 20 ఓవర్లకు గాను 19.3 ఓవర్ వద్ద మరోసారి వర్షం పడటంతో ఇన్నింగ్స్ ను టీమిండియా ముగించాల్సి వచ్చింది. అనంతరం సౌతాఫ్రికా టార్గెట్ ను 15 ఓవర్లలో 152 రన్స్ గా నిర్దేశించారు. కానీ సఫారీ జట్టు 13.5 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
తడబడ్డ ఆ ముగ్గురూ
టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన సౌతాఫ్రికా.. స్కోరు బోర్డుపై ఖాతా తెరవనీయకుండా చేసి వికెట్ ను దక్కించుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(0), శుభ్ మన్ గిల్(0) ఇద్దరూ డకౌట్ గా వెనుదిరిగారు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ(29; 20 బంతుల్లో 4×4, 1×6) కొద్ది సేపే క్రీజులో ఉండటంతో ఇక భారమంతా సూర్యపైనే పడింది. ఆ ఆశల్ని మోస్తూ అతడు సూపర్ ఫినిషర్ రింకూ సింగ్ తో కలిసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. సూర్యను షంసి ఔట్ చేసిన తర్వాత క్రీజులోకి వచ్చిన జితేష్ శర్మ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. చివర్లో రవీంద్ర జడేజా(19)తో కలిసి రింకూ సింగ్ మెరుగైన స్కోరు అందించాడు. కోయెట్జీ 3 వికెట్లు తీసుకున్నాడు.
సౌతాఫ్రికా సైతం టీమిండియా లాగే
సఫారీ జట్టు సైతం టీమిండియా మాదిరిగానే బ్యాటింగ్ కొనసాగించింది. ఓపెనర్ రీజా హెన్రిక్స్(49; 27 బంతుల్లో 8×4, 1×6) వేగంగా ఆడితే మార్ క్రమ్(30) సహకారం అందించాడు. క్లాసెన్(7), మిల్లర్(14) ఔటైనా మిగతా లాంఛనాన్ని స్టబ్స్(14), ఫెహ్లుక్వాయో(10) పూర్తి చేశారు. ముకేశ్ 2, కుల్దీప్, సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా 3 టీ20ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది.