
తొలుత సూర్యకుమార్(100; 56 బంతుల్లో 7×4, 8×6) సెంచరీ, యశస్వి(60; 41 బంతుల్లో 6×4, 3×6) హాఫ్ సెంచరీతో మెరుగైన స్కోరు సాధించిన భారత్.. తర్వాత బౌలింగ్ లోనూ అదరగొట్టింది. టీమిండియా బౌలర్లంతా కంటిన్యూగా వికెట్లు తీసుకుంటూ పోవడంతో దక్షిణాఫ్రికా చేతులెత్తేయక తప్పలేదు. జోహెన్నెస్ బర్గ్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. అనంతరం సౌతాఫ్రికా టపటపా వికెట్లు చేజార్చుకుంది. 4 స్కోరు వద్ద తొలి వికెట్ తో మొదలైన పతనం 42కి వచ్చేసరికి 4 వికెట్లకు చేరుకుంది. స్పిన్నర్లు కుల్దీప్, జడేజా కట్టుదిట్టంగా బాల్స్ వేయడంతోపాటు పోటాపోటీగా వికెట్లు తీయడంతో సఫారీ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. దీంతో 13.5 ఓవర్లలోనే 95 పరుగులకు ఆలౌటై 106 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.
సూర్య, జైస్వాల్ అదరహో
సూర్య సెంచరీ, జైస్వాల్ అర్థ శతకంతో హడలెత్తించడంతో టీమిండియా వేగంగా పరుగులు సాధించింది. ఈ శతకంతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును సొంతం చేసుకున్న కెప్టెన్.. పొట్టి ఫార్మాట్ లో నాలుగు సెంచరీలతో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ముఖ్యంగా సూర్య ఆటే హైలెట్ కాగా, ఫెహ్లుక్వాయో వేసిన ఒకే ఓవర్లో మూడు సిక్స్ లు, ఒక ఫోర్ తో 23 పరుగులు రాబట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్, విలియమ్స్ రెండేసి వికెట్లు.. బర్గర్, షంసి ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.
5 వికెట్లతో వెన్నువిరిచిన కుల్దీప్
దక్షిణాఫ్రికా వికెట్లు టపటపా పడ్డాయి. అద్భుత బంతులతో కుల్దీప్ మాయ చేస్తూ 5 వికెట్ల హాల్ ను అందుకున్నాడు. తొలి ఓవర్ ను సిరాజ్ మెయిడెన్ వేయగా, తర్వాత వచ్చిన బౌలర్లు సైతం పొదుపుగా రన్స్ ఇచ్చారు. ఆ జట్టులో హెన్రిక్స్(8), బ్రెట్స్ కీ(4), మార్ క్రమ్(25), క్లాసెన్(5), ఫెరీరా(12) ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. మిల్లర్ మినహా ఏ ఒక్కరూ నిలవకపోవడంతో సఫారీ ఇన్నింగ్స్ తక్కువ స్కోరు వద్దే ముగిసింది. ఈ విజయంతో సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే.