ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ ను పూర్తి ఆధిపత్యంతో భారత్ దక్కించుకుంది. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన చివరిదైన ఐదో మ్యాచులో ఇంగ్లండ్ కు దారుణ ఓటమిని రుచి చూపించింది. ఏకపక్షం(One Side)గా సాగిన ఆటలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీతో 9 వికెట్లకు 247 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లిష్ టీమ్.. అందులో సగం స్కోరును కూడా అందుకోలేక చేతులెత్తేసింది. ఒక్క ఫిల్ సాల్ట్(55) మినహా ఏ ఒక్కరూ భారత బౌలర్లను అడ్డుకోలేకపోయారు. డకెట్(0), బట్లర్(7), బ్రూక్(2), లివింగ్ స్టోన్(9), బెథెల్(10), బ్రైడన్(3), ఓవర్టన్(1) ఇలా వచ్చి అలా ఔటైపోయారు. టీమ్ఇండియా బౌలర్ల దెబ్బకు ఆ జట్టు ఏ దశలోనూ కోలుకోకపోగా.. 90 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. తుదకు 10.3 ఓవర్లలోనే 97 స్కోరుకు ఆలౌటై 150 రన్స్ తేడాతో దారుణంగా పరాజయం పాలైంది. షమి 3, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె, అభిషేక్ శర్మ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 5 మ్యాచుల సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.