ఛాంపియన్ ట్రోఫీ నిర్వహిస్తున్న పాకిస్థాన్ కు భారత క్రికెట్ బోర్డ్(BCCI) చుక్కలు చూపిస్తోంది. భారత్ ఆడే మ్యాచుల్ని పాక్ కాకుండా తటస్థ వేదికలపై నిర్వహించాలని పట్టుబట్టి మరీ సాధించుకున్న BCCI.. ఇప్పుడు మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఆతిథ్య దేశం(పాక్) పేరిట ముద్రించే జెర్సీ(Jersey)లను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించొద్దంటూ తమ ఆటగాళ్లను హెచ్చరించింది. టోర్నీకి ముందు కెప్టెన్లతో నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం అక్కడకు వెళ్లొద్దంటూ సారథి రోహిత్ శర్మను అలర్ట్ చేసింది. ఫిబ్రవరి 19 నుంచి మొదలయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ పాక్, దుబాయిలో నిర్వహిస్తున్నారు. టీమ్ఇండియా ఆడే మ్యాచులన్నీ దుబాయిలో జరగనుండగా, ఆరంభ వేడుకలు జరిగే పాక్ కు వెళ్లొద్దంటూ రోహిత్ ను ఆదేశించింది.
రోహిత్ అక్కడకు వెళ్తే పాకిస్థాన్ జెర్సీ ధరించాల్సి ఉంటుంది. భారత క్రికెట్ బోర్డు నిర్ణయంపై పాకిస్థాన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈ విషయంలో ICC జోక్యం చేసుకుని తమకు మద్దతివ్వాలని కోరుతోంది. ICC నిబంధనల ప్రకారం టోర్నమెంట్ ఎక్కడ జరిగినా అందులో పాల్గొనే టీంలు ఆతిథ్య దేశం పేరుండే జెర్సీని వేసుకోవాల్సి ఉంటుంది. పాకిస్థాన్ పేరు గల జెర్సీని భారత్ నిరాకరిస్తే అది ఉల్లంఘన(Breach) కిందకే వస్తుంది.