భారత జట్టు 10 తలల ఆటగాళ్లున్న టీమ్ అన్నాడు నెదర్లాండ్స్ కోచ్. ఒకరు ఔటైతే మరొకరన్నట్లుగా అదేం ఆట అన్నట్లుగా ప్రశంసల వర్షం కురిపించాడు. అది నిజమే అన్నట్లుగా న్యూజిలాండ్ తో మ్యాచ్ లో నిరూపించారు టీమిండియా ప్లేయర్లు. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. కివీస్ ను తుత్తునియలు చేసింది. బ్యాటింగ్ ఇలా కూడా ఉంటుందా అన్న రీతిలో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించారు మన ఆటగాళ్లు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ సిక్స్ లతో విరుచుకుపడటంతో టీమిండియాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. శ్రేయస్ అయ్యర్(105; 70 బంతుల్లో 4×4, 8×6) విరాట్ కోహ్లి(117; 113 బంతుల్లో 9×4, 2×6), గిల్(80; 66 బంతుల్లో 8×4, 3×6), రోహిత్(47; 29 బంతుల్లో 4×4, 4×6).. ఎడాపెడా బాది న్యూజిలాండ్ ఆటగాళ్లను ఈ రోజు నిద్రపోకుండా చేశారు.
12.2 ఓవర్లలో 100.. 28.1 ఓవర్లలో 200.. 42 ఓవర్లలో 300.. ఇదీ భారత జట్టు ఆటగాళ్లు సాగించిన విధ్వంసం. సౌథీ, బౌల్ట్, ఫెర్గూసన్, శాంట్నర్, రచిన్, ఫిలిప్స్ ఇలా ఏ బౌలర్నీ వదిలిపెట్టలేదు. ముఖ్యంగా శ్రేయస్ మాత్రం 67 బాల్స్ లోనే సెంచరీ చేశాడంటే విధ్వంసం ఎలా సాగిందో అర్థమవుతుంది. దీంతో భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు చేసింది.