ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ అప్రతిహత విజయ యాత్ర కొనసాగుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 4-0 తేడాతో మట్టికరిపించింది. ఈ టోర్నమెంటులో 5 మ్యాచ్ లకు గాను 4 విజయాలు ఒక డ్రాతో ఇప్పటికే సెమీఫైనల్ చేరిన భారత్.. నామమాత్ర మ్యాచ్ లో దాయాది దేశానికి చుక్కలు చూపించింది. అయితే మ్యాచ్ ప్రారంభమైన 95వ సెకన్ లోనే పాక్ గోల్ సాధించి సంబరాలు చేసుకుంది. దీంతో మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న చెన్నై స్టేడియమంతా నిశ్శబ్దం ఆరించింది. కానీ బిగ్ స్క్రీన్ పై రీప్లే చూశాక ఫ్యాన్స్ శాంతించారు. హనన్ షాహీద్ గోల్ ను అనుమతించకపోవడంతో స్టేడియమంతా సంబరాలు కనిపించాయి. అలా ఇరు జట్లూ డిఫెండ్ ఆటతీరును కనబరుస్తూ ఆసక్తిని రేకెత్తించాయి. కానీ ఆ తర్వాత భారత్ జైత్రయాత్ర మొదలైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయడంతో ఫస్ట్ క్వార్టర్ లో మన జట్టు 2-0 లీడ్ కి చేరుకుంది. జుగ్ రాజ్ సింగ్ మరో గోల్ సాధించడంతో ఆట థర్డ్ క్వార్టర్ ముగిసే సరికి భారత్ 3-0తో నిలిచింది. చివర్లో మణిదీప్ సింగ్ అందించిన మరో పాస్ ను ఆకాశ్ దీప్ గోల్ గా మలచి ఇండియాను 4-0తో విజయతీరాలకు చేర్చాడు.
ఈ టోర్నీ లీగ్ దశలో ఓటమి లేకుండా సెమీస్ చేరుకున్న జట్టుగా భారత్ ఘనతను మూటగట్టుకుంది. పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో నిలిచి దర్జాగా సెమీస్ కు దూసుకెళ్లింది.