
Published 28 Nov 2023
వరల్డ్ కప్ కోల్పోయినా అదే ప్రత్యర్థిపై కుర్రాళ్లతో విరుచుకుపడుతున్న టీమిండియా(Team India).. సిరీస్(Series) పై కన్నేసింది. తొలి రెండు మ్యాచ్ ల్లో గెలిచి ఊపు మీదున్న భారత్ మూడో టీ20లో గెలిచి కప్పు కొట్టాలని చూస్తున్నది. అసోం రాజధాని గువాహటిలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. తొలి మ్యాచ్ లో టార్గెట్ ఛేదించి, సెకండ్ టీ20లో లక్ష్యాన్ని విధించి అద్భుతమైన విజయాల్ని అందుకున్న యువ భారత జట్టు.. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇక సిరీస్ మనదే. పరుగుల వరద పారే పిచ్ పై టీమిండియా ప్లేయర్లు మరోసారి బ్యాట్లకు పని చెబుతారని అభిమానులు ఆశిస్తున్నారు. పరాజయాలున్నప్పుడే అసలు ప్రతాపాన్ని బయటకు తీసే ఆస్ట్రేలియా టీమిండియాకు నిర్ణయాత్మకంగా మారిన మ్యాచ్ ను అంత సులువుగా వదులుకునే అవకాశాలుండవు. అందుకే ఈ పోరు హోరాహోరీగా సాగే అవకాశమే ఉంది.
యశస్వి, రుతురాజ్, ఇషాన్, సూర్య కుమార్, రింకూ సింగ్.. ఇలా అందరూ రాణించినా తిలక్ వర్మ మాత్రం పెద్దగా బ్యాట్ కు పని చెప్పలేదు. దీంతో ఈ మ్యాచ్ లో ఇతడు రాణిస్తేనే మిగతా టీ20లకు అవకాశాలుంటాయి. బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తున్నా తొలి ఓవర్లలో భారత బౌలర్లు ధారళంగా పరుగులిస్తున్నారు. అటు కంగారూ జట్టు సైతం పూర్తిస్థాయిలో ప్రదర్శన చేస్తే భారత్ కు ఇబ్బందులు తప్పవు. అందుకే తొలి రెండు మ్యాచ్ ల మాదిరిగా ఇక్కడా చెలరేగితేనే భారత్ కు విజయం.