వరల్డ్ కప్ లో భారత్ హవా మామూలుగా లేదు. ఆడిన తొమ్మిది మ్యాచ్ ల్లో ఒక్కటంటే ఒక్క ఓటమి లేకుండా లీగ్ దశను ముగించి జయహో అనేలా చేసింది. బెంగళూరులో పసికూన నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్.. ఏ దశలోనూ టార్గెట్ ను రీచ్ అయ్యేలా కనిపించలేదు. 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై 160 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.
దంచుడే దంచుడు
అంతకుముందు భారత్ ఇన్నింగ్స్ దంచుడే దంచుడు అన్నట్లుగా సాగింది. ఇద్దరు సెంచరీలతో విరుచుకుపడితే మరో ముగ్గురు హాఫ్ సెంచరీలతో డచ్ జట్టును బెంబేలెత్తించారు. శ్రేయస్(128 నాటౌట్; 94 బంతుల్లో 10×4, 5×6), రాహుల్ (102; 63 బంతుల్లో 11×4, 4×6), రోహిత్ (61; 54 బంతుల్లో 8×4, 2×6), శుభ్ మన్(51; 32 బంతుల్లో 3×4, 4×6), విరాట్(51; 56 బంతుల్లో 5×4, 1×6) ఊచకోత కోశారు. తొలి ఫిఫ్టీని 40 బాల్స్ లో చేసిన రాహుల్.. మరో 50 చేసేందుకు ఇంకో 22 బాల్స్ మాత్రమే తీసుకున్నాడు. కేవలం 62 బంతుల్లోనే సెంచరీ చేయడంతో డచ్ బౌలర్లు భాధితులుగా మిగిలారు. 10 ఓవర్ల కోటా పూర్తి చేసుకున్న వాన్ బీక్ 107, మీకేరన్ 90, డిలీడ్ 82 పరుగులు ఇచ్చుకున్నారంటే భారత్ బ్యాటింగ్ ఎంత ధాటిగా సాగిందో తెలుసుకోవచ్చు.
అటువైపు ఒక్కటే హాఫ్ సెంచరీ
411 పరుగుల టార్గెట్ ఉన్నా నెదర్లాండ్స్ టీమ్ లో ఏ ఒక్కరూ పెద్దగా నిలవలేకపోయారు. తేజ నిడమనూరు మాత్రమే హాఫ్ సెంచరీ(54) చేశాడు. మిగతా బ్యాటర్లు సైబ్రండ్(45), బరెసి(4), ఒడౌడ్(30), అకర్ మన్(35), కెప్టెన్ ఎడ్వర్డ్స్(17) కొద్దిగా ఫర్వాలేదనిపించారు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా రెండేసి వికెట్ల చొప్పున.. కోహ్లి, రోహిత్ చెరో వికెట్ తీసుకున్నారు. అయ్యర్, రాహుల్ మినహా ఈ మ్యాచ్ లో 9 మంది బౌలింగ్ కు దిగారు. శ్రేయస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. ప్రపంచకప్ లో ఇది చివరి లీగ్ మ్యాచ్ కాగా.. ఇక సెమీఫైనల్స్ స్టార్ట్ కానున్నాయి. ముంబయిలో ఈనెల 15న జరిగే ఫస్ట్ సెమీస్ లో భారత్-న్యూజిలాండ్.. ఈనెల 16న కోల్ కతాలో జరగనున్న రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా తలపడతాయి.