
Published 26 Nov 2023
టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్ తో ఆస్ట్రేలియాను ఏ దశలోనూ కోలుకోకుండా దెబ్బతీశారు. ధనాధన్ బ్యాటింగ్ తో దడదడలాడిస్తూ.. ఆకట్టుకునే బౌలింగ్ తో కట్టడి చేస్తూ.. చురుకైన ఫీల్డింగ్, అద్భుతమైన క్యాచ్ లతో ఉర్రూతలూగించారు. తిరువనంతపురంలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓవర్ కు 12 రన్ రేట్ తో బరిలోకి దిగిన ఆసీస్.. 58 స్కోరుకే 4 వికెట్లు చేజార్చుకుంది. చివరకు మాథ్యూ వేడ్ ఒంటరి పోరాటం చేసినా అండగా నిలిచేవారే లేక ఆసీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులే వద్దే ఇన్నింగ్స్ ముగించి 44 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.
తొలుత బ్యాటర్ల హవా
జైస్వాల్(53; 25 బంతుల్లో 9×4, 2×6), ఇషాన్(52; 32 బంతుల్లో 3×4, 4×6), రుతురాజ్ గైక్వాడ్(58; 43 బంతుల్లో 3×4, 2×6) ధనాధన్ హాఫ్ సెంచరీలతో టీమిండియా దడదడలాడించింది. 10 బంతుల్లోనే 2 సిక్సర్లతో 19 పరుగులు చేసిన సూర్య ఔట్ కాగా.. రింకూ సింగ్(31; 9 బంతుల్లో 4×4, 2×6) హిట్టింగ్ తో తిరుగులేని రీతిలో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. నాథన్ ఎలిస్ 3 వికెట్లు, స్టాయినిస్ ఒక వికెట్ తీసుకున్నారు. కంగారూ బౌలర్లందర్నీ భారత యువ కిశోరాలు కంగారూ పెట్టారు. ముఖ్యంగా జైస్వాల్, ఇషాన్.. షాన్ దార్ ఇన్నింగ్స్ తో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
బెంబేలెత్తించిన బౌలర్ల దళం
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ కు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. ఓపెనర్లు స్మిత్(19), షార్ట్(19), గత మ్యాచ్ లో సెంచరీ చేసిన ఇంగ్లిస్(2), భీకర ఫామ్ లో ఉన్న మ్యాక్స్ వెల్(12) వెంటవెంటనే ఔటవడంతో ఆసీస్ పని అయిపోయిందనుకున్నారంతా. కానీ స్టాయినిస్(45; 25 బంతుల్లో 2×4, 4×6), టిమ్ డేవిడ్(37; 22 బంతుల్లో 4×4, 2×6) జోడీ ఐదో వికెట్ కు 81 పరుగులు జత చేసింది. ఈ ఇద్దరు డేంజరస్ గా మారుతున్న తరుణంలో డేవిడ్ ను బిష్ణోయ్, స్టాయినిస్ ను ముకేశ్ పెవిలియన్ కు పంపారు. ఆ వెంటనే అబాస్(1), ఎలిస్(1), జంపా(1) తిరుగుబాట పట్టడంతో ఆస్ట్రేలియా ఓటమి ఖరారైంది. రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో మూడు వికెట్ల చొప్పున.. అర్షదీప్, అక్షర్, ముకేశ్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. ఈ గెలుపుతో 5 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది.