అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు(Team India) ప్రపంచ కప్పు అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. ముంబయి వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ లో జయకేతనం ఎగురవేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. కివీస్ బౌలింగ్ ను చిత్తు చిత్తు చేసింది. బ్యాటింగ్ ఇలా కూడా ఉంటుందా అన్న రీతిలో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించారు మన ప్లేయర్లు. దీంతో భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై 70 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. ఓవర్ కు 15 చొప్పున రన్ రేట్ సాధించాల్సిన దశలో న్యూజిలాండ్ చేతులెత్తేసి వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. 2019లో సెమీస్ లోనే ఎదురైన పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. అటు భారత్ మాత్రం ఫైనల్ కు చేరుకుని ప్రత్యర్థి కోసం ఎదురుచూస్తున్నది.
శ్రేయస్ ఫాస్టెస్ట్ సెంచరీ
ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ సిక్స్ లతో విరుచుకుపడటంతో టీమిండియాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అయ్యర్(105; 70 బంతుల్లో 4×4, 8×6), విరాట్ కోహ్లి(117; 113 బంతుల్లో 9×4, 2×6), గిల్(80; 66 బంతుల్లో 8×4, 3×6), రోహిత్(47; 29 బంతుల్లో 4×4, 4×6).. ఎడాపెడా బాదడంతో న్యూజిలాండ్ ఆటగాళ్లకు దిక్కుతోచలేదు. ముఖ్యంగా శ్రేయస్ మాత్రం 67 బాల్స్ లోనే సెంచరీ చేశాడంటే విధ్వంసం ఎలా సాగిందో అర్థమవుతుంది. 12.2 ఓవర్లలో 100.. 28.1 ఓవర్లలో 200.. 42 ఓవర్లలో 300.. ఇదీ భారత జట్టు ఆటగాళ్లు సాగించిన విధ్వంసం.
7 వికెట్లతో షమి మాయాజాలం
మొత్తం 7 వికెట్లతో న్యూజిలాండ్ ను మహ్మద్ షమి దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ స్టార్టింగ్ లోనే కివీస్ కు ఎదురుదెబ్బ తగిలింది. కాన్వే(13), రచిన్(13) వెంటనే ఔటయినా మిచెల్(134; 119 బంతుల్లో 9×4, 7×6), విలియమ్సన్(69; 73 బంతుల్లో 8×4, 1×6) 6కు పైగా రన్ రేట్ తో బండిని నడిపించారు. థర్డ్ వికెట్ కు 181 రన్స్ పార్ట్నర్ షిప్ జోడించాక విలియమ్సన్ ను సైతం షమి బుట్టలో వేసుకున్నాడు. ఆ వెంటనే లాథమ్(0) డకౌట్ గా వెనుదిరగడంతో భారత్ గెలుపు లాంఛనమే అనుకున్నారంతా. కానీ మిచెల్, ఫిలిప్స్(41; 33 బంతుల్లో 4×4, 2×6) మన బౌలర్లను కంగారు పెట్టారు. ఫిలిప్స్ ను బుమ్రా, చాప్ మన్ కు కుల్దీప్ వెనక్కు పంపాడు. మంచి ఫామ్ లో ఉన్న మిచెల్ సైతం షమికి దొరికిపోవడంతో కివీస్ పరాజయం ఖరారైంది. ఈ వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా షమి నిలిచాడు. ప్రస్తుతం ఈ పేసర్ 23 వికెట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా 22 వికెట్ల సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. జంపా 9 మ్యాచ్ ల్లో 22 వికెట్లు తీసుకుంటే.. షమి కేవలం 6 మ్యాచ్ ల్లోనే అతణ్ని దాటిపోయాడు.