రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే మిగతా మూడు రోజుల ఆటను నడిపిస్తున్న భారత్ కు.. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ అండగా నిలిచాడు. నాలుగు వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లండ్ పై టీమ్ఇండియాకు ఆధిక్యం లభించింది. సిరాజ్, జడేజా, కుల్దీప్ ధాటికి ఇంగ్లిష్ జట్టు… మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 319 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ టీమ్ లో బెన్ డకెట్(153; 151 బంతుల్లో 23×4, 2×6) తర్వాత ఏ ఒక్కరూ హాఫ్ సెంచరీ మార్క్ చేరుకోలేకపోయారు. రూట్(18), బెయిర్ స్టో(0), బెన్ స్టోక్స్(41), బెన్ ఫోక్స్(13), రెహాన్ అహ్మద్(6) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.
బౌలర్లు భళా…
నలుగురు రెగ్యులర్ బౌలర్లతోనే నెట్టుకొస్తున్న భారత్ కు… ఎక్కడా ఇబ్బంది కలగకుండా వికెట్లు దక్కాయి. 207/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్.. మిడిలార్డర్ వైఫల్యంతో తొందరగానే ఆలౌటయింది. కెప్టెన్ స్టోక్స్ నిలబడాలని ప్రయత్నించినా జడేజా బాల్ కు ఔట్ కాక తప్పలేదు. సిరాజ్ నాలుగు వికెట్లు తీస్తే.. స్పిన్నర్లు కుల్దీప్, జడేజా తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. అశ్విన్, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 445 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీమ్ఇండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రోహిత్ సేన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.