నిన్న ఒక్కరోజే 17 వికెట్లు పడి బెంబేలెత్తించిన పెర్త్(Perth) పిచ్ పై ఈరోజు భారత ఓపెనర్లు పండుగ చేసుకున్నారు. ఎక్కడా అలసత్వాని(Neglect)కి తావివ్వకుండా, ఓపికగా బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు వికెట్ దక్కకుండా చేశారు. తొలి వికెట్ కు 172 పరుగుల పార్ట్నర్ షిప్ తో ఆస్ట్రేలియాలో రికార్డు స్థాయి స్కోరు సాధించారు. 38 ఏళ్ల తర్వాత 150 పైగా భాగస్వామ్యం అందించిన జోడీగా నిలిచిపోయారు. 1986లో సునీల్ గవాస్కర్-కృష్ణమాచారి శ్రీకాంత్ జోడీ 191 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150కి ఆలౌట్ అయితే కంగారూలు 104కే చాప చుట్టేశారు.
టీమ్ఇండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. కెప్టెన్ బుమ్రా 5 వికెట్లు తీసుకుంటే తొలి మ్యాచ్ ఆడుతున్న హర్షిత్ రాణా 3, సిరాజ్ 2 వికెట్ల చొప్పున తీసుకున్నారు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 172 పరుగులు చేసింది. ఓపెనర్లు జైస్వాల్(90 బ్యాటింగ్), రాహుల్(62 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మొత్తంగా బుమ్రా సేన 218 రన్స్ లీడ్ తో పెర్త్ టెస్టును శాసించే స్థాయికి చేరుకుంది. ఏడుగురు బౌలర్లను మార్చినా యశస్వి-రాహుల్ జోడీని విడదీయలేకపోయారు.