5 ఓవర్లలో 50 పరుగులు.. 10 ఓవర్లలో 100 పరుగులు. ఇదీ భారత జట్టు స్కోరు. ఓవర్ కు 10 రన్ రేట్ తో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్ దుమ్మురేపడంతో టీమ్ ఇండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిన భారత్.. మిగతా రెండింట్లో మాత్రం ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. వెస్టిండీస్ తో లాడర్ హిల్లో జరిగిన నాలుగో టీ20లో టీమ్ ఇండియా 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ ను నిర్ణీత 20 ఓవర్లలో 178/8కి పరిమితం చేసింది. కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 179 రన్స్ టార్గెట్ ను ఛేదించింది. భారత్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్(84 నాటౌట్; 51 బంతుల్లో, 11×4, 3×6), గిల్ (77 నాటౌట్; 47 బంతుల్లో, 3×4, 5×6) వెస్టిండీస్ బౌలింగ్ ను చీల్చి చెండాడారు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. జట్టు స్కోరు 165కు చేరుకున్న తర్వాత గిల్ ఔటయ్యాడు. తిలక్ వర్మ(7 నాటౌట్)తో కలిసి జైస్వాల్ జట్టుకు గెలుపునందించాడు. భారత్ కోల్పోయిన ఏకైక వికెట్ షెఫర్డ్ ఖాతాలో చేరింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు.. స్టార్టింగ్ లో తడబడింది. ఓపెనర్లు కైల్ మయర్స్(17), బ్రెండన్ కింగ్(18) తొందరగానే ఔటయ్యారు. నాలుగు, ఐదో నంబర్ బ్యాటర్లు నికోలస్ పూరన్(1), రోమన్ పావెల్(1) ఒకర్నొకరు ఫాలో అయ్యారు. కానీ వన్ డౌన్ బ్యాటర్ షాయ్ హోప్(45 నాటౌట్; 29 బంతుల్లో, 3×4, 2×6), షిమ్రన్ హెట్ మయర్(61 నాటౌట్; 39 బంతుల్లో, 3×4, 4×6) దూకుడుగా ఆడటంతో ఆ జట్టు మంచి స్కోరు సాధించింది. 57కే 4 వికెట్లు కోల్పోయిన టీమ్ ను ఈ ఇద్దరూ ఆదుకున్నారు. అర్షదీప్ సింగ్ 3, కుల్దీప్ 2 వికెట్లు తీయగా.. ముకేశ్, చాహల్, అక్షర్ తలో వికెట్ తీసుకున్నారు. యశస్వి జైస్వాల్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో ఇరు జట్లు 2-2తో ఈక్వల్ గా నిలిచాయి.