తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన భారత అండర్-19 క్రికెట్ జట్టు మూడో మ్యాచ్ లో UAEపై ఘన విజయం(Big Win) సాధించింది. దుబాయ్ లో జరుగుతున్న ఆసియా కప్ లో ఓపెనర్లు ఆయుష్ మహత్రే, వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీలతో విరుచుకుపడటంతో ఆట ఏకపక్షంగా ముగిసింది. షార్జాలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన UAE బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆ టీమ్ భారత బౌలర్ల ధాటికి 137కే కుప్పకూలితే ముహమ్మద్ రియాన్(35)దే హయ్యెస్ట్ స్కోర్. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన మన కుర్రాళ్లు తొలి వికెట్ కు 100కు పైగా పార్ట్నర్ షిప్ అందించడంతో గెలుపు తేలికైంది.
మహత్రే(67 నాటౌట్; 51 బంతుల్లో 4×4, 4×6), సూర్యవంశీ(76 నాటౌట్; 46 బంతుల్లో 3×4, 6×6) ఫోర్లు, సిక్సులతో దడదడలాడించారు. ఈ ఇద్దరి వీరవిహారంతో 16.1 ఓవర్లలోనే 143 పరుగులు చేసిన భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం దక్కించుకుంది. గ్రూప్-Aలో భారత్, పాక్, UAE, జపాన్ ఉండగా.. మూడు మ్యాచులాడిన భారత్ రెండు విజయాలు సాధించి 4 పాయింట్లతో ఉంది.