
Published 14 Jan 2024
టీ20 మ్యాచ్ మజా రుచి చూపించారు.. భారత యువ ప్లేయర్లు. దూబె దంచికొట్టడం, జైస్వాల్ చుక్కలు చూపించడంతో అఫ్గాన్ కు దిక్కులేకుండా పోయింది. ఇండోర్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్.. అఫ్గాన్ కు బ్యాటింగ్ అప్పగించాడు. గుల్బదిన్ నాయబ్(57) ఒంటరి పోరాటంతో ఆ జట్టు 172 రన్స్ కు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్ జైస్వాల్, మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబె శివాలెత్తడంతో టార్గెట్ అలా కరుగుతూ పోయింది. 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 173 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయాన్నందుకుంది.
తేలిపోయిన అఫ్గాన్…
రహ్మతుల్లా గుర్బాజ్(14), ఇబ్రహీం జద్రాన్(8), అజ్మతుల్లా ఒమర్జాయ్(2), మహ్మద్ నబీ(14), నజ్బుల్లా జద్రాన్(23), కరీం జనత్(20), ముజీబుర్ రహ్మాన్(21) అంతో ఇంతో రాణించారు. గుల్బదిన్ నాయబ్ హాఫ్ సెంచరీతో ఆ టీమ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. అర్షదీప్ సింగ్ 3, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ రెండేసి చొప్పున, దూబె ఒక వికెట్ తీసుకున్నారు.
జైస్వాల్, శివమ్ దూకుడు…
కెప్టెన్ రోహిత్ శర్మ(0) మరోసారి నిరాశపరిచినా, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(68; 34 బంతుల్లో 5×4, 6×6) మాత్రం దుమ్ముదులిపాడు. వన్ డౌన్ లో వచ్చిన కోహ్లి(29; 16 బంతుల్లో 5×4) అండతో జైస్వాల్ దూకుడు పెంచాడు. అతడు 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 27 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక కోహ్లి ఔటైన తర్వాత అప్పుడు మొదలైంది మరో వీరవిహారం. శివమ్ దూబె(63; 32 బంతుల్లో 5×4, 4×6) ఊపు సైతం మామూలుగా సాగలేదు. 3 ఫోర్లు, 4 సిక్స్ లతో కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్ నబీ బౌలింగ్ లో మూడు బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. జితేష్ శర్మ(0)కే వెనుదిరిగినా అప్పటికే లక్ష్యం దిశగా టీమిండియా సాగిపోయింది. రింకూ సింగ్(9) నాటౌట్ గా నిలిచాడు. 12.1 ఓవర్లలోనే 150 స్కోరు చేసిందంటే భారత బ్యాటర్ల దంచుడు అర్థం చేసుకోవచ్చు. ఈ విజయంతో 3 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచి కప్పును అందుకోబోతున్నది.