ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టు(Third Test)లో భారతజట్టు సత్తా చాటింది. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో తొలిరోజు ఆటను శాసించింది. ఇక ఈ మ్యాచ్ తోనే టెస్టుల్లో అడుగుపెట్టిన యువ ప్లేయర్ సర్ఫరాజ్ అహ్మద్.. తనను రంజీల్లో ఎందుకు మేటి ఆటగాడిగా భావిస్తారో తన మార్క్ ఆటతీరుతోనే చాటిచెప్పాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ పరిచయం చేసిన ‘బజ్ బాల్’ గేమింగ్ తోనే అదే జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్… 5 వికెట్లకు 326 పరుగులు చేసింది.
రోహిత్, జడేజా దూకుడు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ప్రారంభంలోనే ఇబ్బంది ఎదురైంది. వరుసగా ముగ్గురు బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. జైస్వాల్(10), గిల్(0), పటీదార్(5)… వెంటవెంటనే ఔటవడంతో 33 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది టీమ్ఇండియా. ఐదో వికెట్ గా క్రీజులోకి దిగిన జడేజా(110 నాటౌట్; 212 బంతుల్లో 9×4, 2×6) అండగా.. ఓపెనర్ రోహిత్ శర్మ(131; 196 బంతుల్లో 14×4, 3×6) సెంచరీ చేశాడు. ఈ జంట నాలుగో వికెట్ కు 234 రన్స్ పార్ట్నర్ షిప్ జోడించింది.
సర్ఫరాజ్ ధమాకా…
రోహిత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్(62; 66 బంతుల్లో 9×4, 1×6).. ధనాధన్ ఆటతో దడదడలాడించాడు. వన్డే టైప్ గేమ్ తో 48 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఎక్కడా తొణకకుండా పూర్తి ప్రొఫెషనలిజంతో బ్యాటింగ్ చేసిన తీరు ఆకట్టుకుంది. గ్రౌండ్ కు అన్ని వైపులా షాట్లు బాదుతూ అలరించాడు. చివర్లో రనౌటై వెనుదిరగడంతో.. నైట్ వాచ్ మన్ గా కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నాడు.