3 వికెట్లకు 112తో ఉన్న స్కోరు కాస్తా 177కి చేరుకునే సరికి 7 వికెట్లు నేలకూలాయి(Fall Of Wickets). ఆడతారనుకున్న కీ ప్లేయర్లంతా వెనుదిరగడంతో రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ ఎదురీదుతున్నది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ నాలుగు కీలక వికెట్లు తీసుకుని భారత్ ను దెబ్బతీశాడు. 302/7తో రెండో రోజు బ్యాటింగ్ కంటిన్యూ చేసిన ఇంగ్లండ్.. 355 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు చేజార్చుకుని 219 రన్స్ చేసింది.
మరో 53 జోడించి..
ఇంగ్లండ్ మరో 53 పరుగులు జోడించి ఆలౌటైంది. ఆ జట్టులో జో రూట్ 122 రన్స్ తో నాటౌట్ గా మిగిలాడు. క్రాలీ(42), డకెట్(11), పోప్(0), బెయిర్ స్టో(38), స్టోక్స్(3), ఫోక్స్(47), హార్ట్ లీ(13), రాబిన్సన్(58), బషీర్(0), అండర్సన్(0)గా నిలిచారు.
తడ’బ్యాటు’…
రెండోరోజు లంచ్ కు ముందే ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే కష్టం వచ్చి పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ(2)ను అండర్సన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వరుసగా నలుగుర్ని బషీర్ వెనక్కు పంపాడు. శుభ్ మన్ గిల్(38), రజత్ పటీదార్(17), రవీంద్ర జడేజా(12) వెంటవెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. 112/3తో బాగానే ఆడుతున్నట్లు కనిపించిన టీమ్ఇండియా… మరో 65 పరుగులకే ఇంకో నాలుగు వికెట్లు కోల్పోయింది. మరోసారి భారీ స్కోరు సాధిస్తాడనుకున్న జైస్వాల్(73; 117 బంతుల్లో 8×4, 1×6) ఊహించని బాల్ కు బౌల్డయ్యాడు. కాసేపటికే సర్ఫరాజ్(14), అశ్విన్(1) అదే దారి పట్టారు. కీపర్ ధ్రువ్ జురెల్(30 నాటౌట్), కుల్దీప్ యాదవ్(17 నాటౌట్) క్రీజులో ఉన్నారు.