57 పరుగులకే మూడు… 112 స్కోరుకే ఐదు వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకుంటూ జో రూట్(106 నాటౌట్) సెంచరీ చేయడంతో ఇంగ్లండ్ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలీ(42), బెన్ డకెట్(11), ఒలీ పోప్(0), జానీ బెయిర్ స్టో(38), బెన్ స్టోక్స్(3) తొందరగానే అవుటైనా రూట్ మాత్రం క్రీజులోనే నిలబడ్డాడు.
రాంచీలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ను.. భారత పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ దెబ్బతీశాడు. వెంటవెంటనే మూడు వికెట్లు తీసుకోవడంతో ఆ జట్టు కష్టాల్లో పడ్డట్లనిపించింది. మరోవైపు మహ్మద్ సిరాజ్ 2, జడేజా, అశ్విన్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.