‘బర్త్ డే బాయ్’ విరాట్ కోహ్లి మరోసారి ప్రతాపం చూపించాడు. స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకులు, టీవీలకు అతుక్కుపోయిన క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంటూ సెంచరీ కంప్లీట్ చేశాడు. గత మ్యాచ్ లో కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్న విరాట్.. ఈసారి మాత్రం దాన్ని నిజం చేస్తూ అందరి ఆశల్ని నిలబెట్టాడు. కోహ్లి 97కు చేరుకోగానే స్టేడియం మొత్తం మొబైల్ ఫోన్ల లైట్ల ధగధగల్లో మెరిసి మురిసింది. కోహ్లి 119 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. విరాట్(101 నాటౌట్; 121 బంతుల్లో 10×4)తోపాటు దక్షిణాఫ్రికా బౌలర్లను రోహిత్ సేన ఉతికి ఆరేయడంతో 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగుల స్కోరు వచ్చింది. మార్కో జాన్సన్ 9 ఓవర్లలో 9.33 ఎకానమీతో 84 రన్స్ ఇచ్చాడు.
బ్యాటింగ్ లోతు చాటిచెప్పిన టీమిండియా
ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లోతు ఏంటో మరోసారి భారత్ చాటి చెప్పింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్.. స్టార్టింగ్ నుంచే పరుగుల వరద పారించాడు. రోహిత్, గిల్ ధాటికి టీమిండియా 4.3 ఓవర్లలోనే 50 స్కోరుకు చేరుకుంది. రోహిత్(40; 24 బంతుల్లో 6×4, 2×6) మంచి ఫామ్ లో ఉన్న దశలో ఔట్ కాగా.. కొద్దిసేపటికే గిల్(23; 24 బంతుల్లో 4×4, 1×6) వెనుదిరిగాడు. మహరాజ్ వేసిన సూపర్ డెలివరీకి ఆశ్చర్యకర రీతిలో గిల్ అవుట్ అయ్యాడు. శ్రేయస్ తో కలిసి విరాట్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. భారత్ స్కోరు 13.1 ఓవర్లలో 100కు చేరుకోగా.. కోహ్లి 67 బాల్స్ లో 71వ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. దీంతో 119 మ్యాచ్ ల్లో 6,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్. అటు అయ్యర్ సైతం 64 బాల్స్ 50 రన్స్ చేయగా.. చివరకు(77; 87 బంతుల్లో 7×4, 2×6) ఎంగిడి బౌలింగ్ లో మార్ క్రమ్ కు క్యాచ్ ఇచ్చాడు. సూర్యకుమార్ వస్తూనే ఫోర్లతో జోరు చూపించాడు. 5 ఫోర్లతో 14 బంతుల్లోనే 22 రన్స్ చేసి కీపర్ క్యాచ్ తో వెనుదిరిగాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (29; 15 బంతుల్లో 3×4, 1×6) ధాటిగా ఆడాడు.