ఇప్పటివరకు ఓటమన్నదే లేకుండా విజయ యాత్ర సాగిస్తున్న భారత జట్టుతో నేడు శ్రీలంక తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముంబయి వాంఖడే స్టేడియంలో మొదలయ్యే మ్యాచ్ లో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్ చేరుతుంది. అటు లంక ఓడితే ఆ జట్టు అవకాశాలు బాగా దెబ్బతినడమే కాకుండా ఇంటి బాట పట్టనుంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య లీగ్ మ్యాచ్ లన్నింటికీ దూరం కావటంతో మొన్నటి టీమ్ నే కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్క శ్రేయస్ అయ్యర్ తప్ప మిగతా బ్యాటర్లంతా బాగానే ఆడుతున్నారు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో కోహ్లి, గిల్ విఫలమైనా మిగతా మ్యాచ్ ల్లో బాగానే ఆడారు.
ముఖ్యంగా గిల్ మాత్రం ఇంకా పూర్తిస్థాయి ఫామ్ లోకి రావాల్సి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం సూపర్ ఫామ్ తో అదరగొడుతూ ప్రతి మ్యాచ్ లోనూ జట్టుకు మూలస్తంభంలా ఉంటున్నాడు. ఈ ప్రపంచకప్ ఆరంభ పోరులో ఆస్ట్రేలియాతో(0) మినహా ప్రతి మ్యాచ్ లోనూ రాణించాడు. మిగతా ఆరింట్లో వరుసగా 131, 86, 48, 46, 87 స్కోర్లు చేశాడు. ఆరింటికి రెండు మ్యాచ్ ల్లోనే గెలిచి నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న లంక వరుసగా మూడు మ్యాచ్ లు గెలిస్తేనే సెమీస్ కు పోటీలో ఉంటుంది. భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లతో పోరు ఉండటంతో అన్నింట్లోనూ గెలవడం అసాధ్యమే.