భారత్, వెస్టిండీస్ మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరుగుతున్న రెండో టెస్టు వర్షం కారణంగా నిలిచిపోయింది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు ‘డ్రా’గా ప్రకటించారు. ఈ రెండు టెస్టుల సిరీస్ ను భారత్ 1-0తో గెలుచుకుంది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 438, సెకండ్ ఇన్నింగ్స్ లో 181/2 పరుగుల్ని చేసింది. వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 255, సెకండ్ ఇన్నింగ్స్ లో 76/2తో ఉండగా వర్షం పడింది. వరుసగా రెండు టెస్టుల్లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేద్దామనుకున్న రోహిత్ సేన ఆశలు నెరవేరలేదు. రెండో ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్ పించ్ హిట్టింగ్ తో అలరించాడు. కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
రెండో ఇన్నింగ్స్ లో భారత్ 24 ఓవర్లలో 181 పరుగులు చేసిందంటే ఎంత వేగంగా బ్యాటింగ్ సాగిందో అర్థమవుతుంది. వర్షం ముప్పు పొంచి ఉందని భావించడంతో 7.54 రన్ రేట్ తో పరుగుల వరద పారించి విండీస్ కు టార్గెట్ పెట్టింది. టెస్టుల్లో అత్యధిక వేగంగా 100 పరుగులు సాధించిన రికార్డు టీమ్ ఇండియా సొంతమైంది.