
కొండంత టార్గెట్ చేతిలో ఉన్నా తనను మించిన ఛేజర్(Chaser) లేడని విరాట్ కోహ్లి మరోసారి నిరూపించాడు. పాయింట్స్ టేబుల్ లో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్న న్యూజిలాండ్(Newzealand)ను సైతం ఓడించి తన విజయపరంపరను భారత్(India) కొనసాగించింది. ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. న్యూజిలాండ్ కు బ్యాటింగ్ అప్పగించాడు. డరైల్ మిచెల్(130; 127 బంతుల్లో, 9×4, 5×6) సెంచరీకి తోడు రచిన్ రవీంద్ర(75; 87 బంతుల్లో, 6×4, 1×6) విజృంభించడంతో కివీస్ జట్టు సరిగ్గా 50 ఓవర్లలో 273 రన్స్ కు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు శుభారంభం లభించినా ఓపెనర్లు వరుసగా ఔట్ కావడానికితోడు మిడిలార్డర్ కూడా రాణించకపోవడంతో కష్టాల్లో పడింది. కానీ విరాట్ కోహ్లి మరోసారి ప్రతాపం చూపించడంతో భారత్ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ తో ఐదింటికి ఐదింటిలో గెలిచి పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేజ్ ఆక్రమించింది. 48 ఓవర్లలో 274 పరుగులు చేసిన భారత్ 4 వికెట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
5 వికెట్లతో విజృంభించిన షమి
300కు పైగా రన్స్ చేస్తుందనుకున్న కివీస్ ను కట్టడి చేశాడు షమి. 5 వికెట్ల హాల్ తో లాథమ్ సేనను బెంబేలెత్తించాడు. 19 స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆ జట్టు.. మిచెల్, రచిన్ దూకుడుతో మూడో వికెట్ కు 159 పరుగుల పార్ట్నర్ షిప్ నమోదు చేసుకుంది. పలు సార్లు లైఫ్ లు దక్కడంతో బతికిపోయిన రచిన్.. మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అటు మిచెల్ మాత్రం బాల్ కో రన్ చొప్పున రన్ రేట్ నడిపించాడు. ఈ ఇద్దరితోపాటు యంగ్, శాంట్నర్, హెన్రీని తక్కువ స్కోరుకే షమి ఔట్ చేశాడు. భారీ స్కోరు చేస్తుందనుకున్న కివీస్ ను కట్టడి చేయడంలో షమిదే మెయిన్ రోల్. అటు కుల్దీప్ యాదవ్ 2, బుమ్రా, సిరాజ్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.
టెన్షన్ లోనూ తగ్గని కోహ్లి జోరు
విరాట్ కోహ్లి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తృటిలో సెంచరీ కోల్పోయినా(95; 104 బంతుల్లో, 8×4, 2×6) ఛేజింగ్ లో తానెంత విలువైన ఆటగాడో మరోసారి చాటిచెప్పాడు. రోహిత్(46; 40 బంతుల్లో, 4×4, 4×6) ఉన్నంత సేపూ ఫాస్ట్ గా రన్స్ చేస్తూ సిక్స్ లతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కానీ ఫెర్గూసన్ అద్భుతమైన బాల్ కు బౌల్డ్ అయ్యాడు. గిల్(26) కూడా వెంటనే ఔటవడంతో క్రీజులోకొచ్చిన శ్రేయస్ అయ్యర్(33) కొద్దిసేపు కోహ్లికి సహకరించాడు. అయ్యర్ ను బౌల్ట్ ఔట్ చేసిన తర్వాత రాహుల్(27) సైతం తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకుంటాడనుకున్న సూర్యకుమార్(2) రనౌట్ కావడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లు కనపడింది. 89 రన్స్ చేయాల్సిన దశలో 191 స్కోరు వద్ద సూర్య ఔట్ కాగా.. జడేజా(39 నాటౌట్; 44 బంతుల్లో, 3×4, 1×6) సమయస్ఫూర్తితో బ్యాటింగ్ చేశాడు. కోహ్లి, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే వేగంగా రన్స్ చేశారు. ఇంకో 5 రన్స్ చేస్తే సెంచరీ కంప్లీట్ అవుతుందన్న టైమ్ లో 269 స్కోరు వద్ద కోహ్లి క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో మిగతా లాంఛనాన్ని జడేజా పూర్తి చేసి భారత్ జైత్రయాత్రను కంటిన్యూ చేశాడు. 5 వికెట్లు తీసిన షమి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.