Published 17 Dec 2023
తొలుత ప్రత్యర్థిని బ్యాటింగ్ లో కట్టిపడేయడం, తర్వాత టార్గెట్ రీచ్ చేయడంలో దూకుడు కనబర్చడం.. ఇలా అన్ని రంగాల్లో పైచేయి సాధించడంతో తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయాన్ని సాధించింది. ‘సింగ్ ఈజ్ కింగ్’ లెవెల్లో అర్షదీప్ 5 వికెట్లతో దడదడలాడిస్తే, తానేం తక్కువ కాదన్నట్లు ఆవేశ్ ఖాన్ ఆవేశం చూపిస్తే దక్షిణాఫ్రికా టీమ్ ఏ దశలోనూ కోలుకోలేదు. ఈ ఇద్దరూ తొమ్మిది వికెట్లు పంచుకోవడంతో జోహెన్నెస్ బర్గ్ లో జరుగుతున్న మ్యాచ్ లో ఆతిథ్య జట్టు 27.3 ఓవర్లలో 116 పరుగులకే చేతులెత్తేసింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా.. 16.4 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 117 రన్స్ చేసి 8 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
పేసర్ల ధాటికి విలవిల
ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికాకు పూర్తి భిన్నమైన ఆటతీరును భారత్ జట్టు చూపించింది. అర్షదీప్, ఆవేశ్ ఖాన్ ధాటికి హెన్రిక్స్(0), రసెల్ వాన్ డెర్(0), టోనీ డి జోర్జి(28), కెప్టెన్ మార్ క్రమ్(12), క్లాసెన్(6), మిల్లర్(2), మల్డర్(0) ఇలా టాప్, మిడిలార్డర్ అంతా చేతులెత్తేసింది. చివర్లో ఫెలుక్వాయో(33) కాసేపు క్రీజులో నిలదొక్కుకోవడంతో ఆ జట్టు 100 పరుగులైనా చేయగలిగింది. 73కే 8 వికెట్లు పడ్డ టీమ్ ను ఆల్ రౌండర్ ఫెలుక్వాయో ఆదుకున్నా, 116కే చేతులెత్తేసి స్వదేశంలో అత్యల్ప స్కోరు రికార్డును మూటగట్టుకుంది.
అరంగేట్ర మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ
అరంగేట్ర మ్యాచ్ లోనే సాయి సుదర్శన్(55 నాటౌట్; 43 బంతుల్లో 9×4) తిరుగులేని ఆటను ప్రదర్శించాడు. మరో ఓపెనర్ రుతురాజ్(5) తక్కువ స్కోరుకే ఔటైనా సుదర్శన్ మాత్రం దూకుడుతో బ్యాటింగ్ చేశాడు. కేవలం 41 బంతుల్లోనే 8 ఫోర్లతో ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. అటు మరో ఎండ్ లో శ్రేయస్ అయ్యర్(52 ; 45 బంతుల్లో 6×4, 1×6) సైతం 44 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 111 స్కోరు వద్ద రెండో వికెట్ గా అయ్యర్ ఔటైనా భారత్ ను సాయి సుదర్శన్ విజయతీరాలకు చేర్చాడు. అర్షదీప్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా, ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 లీడ్ లో ఉంది.