వరల్డ్ కప్ ముందర భారత క్రికెట్ జట్టు కంటిన్యూ విజయాలతో దూసుకుపోతోంది. ఆసియా కప్ గెలుచుకుని ఊపు మీదున్న టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాను సైతం తొలి వన్డేలో చిత్తు చేసింది. నలుగురు మెయిన్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చినా.. అగ్రశ్రేణి జట్టయిన ఆసీస్ తో కుర్రాళ్లు అదరగొట్టారు. తొలుత బౌలింగ్ లో షమి అదరగొడితే… అనంతరం బ్యాటింగ్ లో యువ ఓపెనర్లు గిల్, రుతురాజ్ సత్తా చూపించారు. 3 వన్డేల సిరీస్ లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్ లో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత్.. ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించింది. నిర్ణీత 50 ఓవర్లలో కంగారూ జట్టు 276 రన్స్ కు ఆలౌట్ కాగా.. 48.5 ఓవర్లలో రాహుల్ సేన 5 వికెట్లకు 281 స్కోరు సాధించింది. శ్రేయస్ అయ్యర్ మరోసారి ఫెయిల్ అయితే… ఎట్టకేలకు సూర్యకుమార్ గాడిలో పడ్డాడు. వన్డే ఆటతీరుపై విమర్శలు ఎదుర్కొంటున్న సూర్య.. కీలక సమయంలో రాణించాడు.
మొన్న సిరాజ్.. నేడు షమి
పదునైన బంతులతో షమి దడదడలాడించాడు. ముఖ్యంగా జట్టులోని పేస్ బౌలర్లలో ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్ లో సత్తా చూపిస్తున్నారు. ఆసియా కప్ ఫైనల్ లో సిరాజ్ 6 వికెట్లు తీస్తే.. ఈరోజు షమి వంతు వచ్చింది. ఓపెనర్ మిచెల్ మార్ష్(4) షమి బౌలింగ్ లో గిల్ కు క్యాచ్ ఇచ్చాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(52; 53 బంతుల్లో, 6×4, 2×6) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ లో వార్నర్ దే అత్యధిక(Highest) స్కోరు కాగా.. స్మిత్(41)తో కలిసి రెండో వికెట్ కు 94 రన్స్ పార్ట్నర్ షిప్ జోడించాడు. వార్నర్ ను జడేజా, స్మిత్ ను షమి వెనక్కు పంపారు. లబుషేన్(39), గ్రీన్(31), ఇంగ్లిస్(45), స్టాయినిస్(29) రాణించారు. శార్దూల్ కు వికెట్లేమీ దక్కకపోగా భారీగా(10 ఓవర్లలో 78) పరుగులు సమర్పించుకున్నాడు. షమి 5 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు.
హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన నలుగురు
ఓపెనర్లు గిల్(74; 63 బంతుల్లో, 6×4, 2×6), రుతురాజ్(71; 77 బంతుల్లో, 10×4) ఒకరిని మించి ఒకరు షాట్లు ఆడటంతో భారత్ కు శుభారంభం లభించింది. 142 పరుగులకు గానీ తొలి వికెట్ ను తీయలేకపోయింది ఆస్ట్రేలియా. స్టార్ బౌలర్లు కమిన్స్, స్టాయినిస్, అబాట్, ఆడమ్ జంపాలను ఓపెనర్లు ఆటాడుకున్నారు. కానీ 9 పరుగుల వ్యవధిలోనే టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయింది. అయ్యర్(3) నిరాశపరిస్తే.. రాహుల్(58 నాటౌట్; 63 బంతుల్లో, 4×4, 1×6), సూర్య(50; 49 బంతుల్లో, 5×4, 1×6) హాఫ్ సెంచరీలు సాధించారు. చివర్లో సూర్య ఔటైనా జడేజాతో కలిసి రాహుల్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో జంపాకు 2, కమిన్స్, అబాట్ ఒక వికెట్ చొప్పున దక్కాయి. షమికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఈ విజయంతో 3 మ్యాచ్ ల సిరీస్ లో టీమ్ఇండియా 1-0తో నిలిచింది. రెండో వన్డే ఈ నెల 24న జరగనుంది.