
బంగ్లాదేశ్ పై ఘన విజయంతో భారత్ జట్టు వరుస(Continue)గా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పుణెలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదే అని నిరూపిస్తూ ఆ జట్టు ఓపెనర్లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆ టీమ్.. 8 వికెట్లకు 256 పరుగులు చేసింది. అనంతరం టీమ్ఇండియా.. కోహ్లి విన్యాసంతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్, గిల్ నిలకడగా ఆడటంతో సునాయాస విజయాన్ని అందుకుంది. టార్గెట్ ఛేదనలో తనకు తిరుగులేదని విరాట్ మరోసారి నిరూపించాడు. కోహ్లి సెంచరీ(103 నాటౌట్; 97 బంతుల్లో 6×4, 4×6)తో టీమ్ఇండియా 41.3 ఓవర్లలో 3 వికెట్లకు 261 రన్స్ చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
బంగ్లా ఓపెనర్ల ధనాధన్
తాంజిద్ హసన్(51; 43 బంతుల్లో 5×4, 3×6), లిట్టన్ దాస్(66; 82 బంతుల్లో, 7×4) భారత బౌలర్లకు చికాకు తెప్పించారు. ఫస్ట్ వికెట్ కు 93 రన్స్ జోడించి బలమైన పునాది వేశారు. ఈ ఇద్దరి తర్వాత వచ్చిన బ్యాటర్లు నిలదొక్కుకోకపోవడంతో మధ్యలో బంగ్లా స్కోరు నిదానంగా సాగింది. నజ్ముల్ శాంటో(8), మెహిదీ మిరాజ్(3), తౌహిద్ హృదాయ్(16) వెంటవెంటనే వెనుదిరిగారు. వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్(38), మహ్మదుల్లా(46) రాణించడంతో బంగ్లా మెరుగైన స్కోరు సాధించింది. బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయడంతోపాటు రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. చివర్లో భారీ స్కోరు దిశగా జట్టును తీసుకెళ్తున్న రహీమ్, మహ్మదుల్లాను ఔట్ చేసి బంగ్లా మరింత స్కోరు చేయకుండా నిలువరించాడు. బుమ్రాతోపాటు సిరాజ్, జడేజా రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు. శార్దూల్, కుల్దీప్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
హడలెత్తించిన టాప్-3 బ్యాటర్లు
257 పరుగుల లక్ష్యం(Target)తో బరిలోకి దిగిన భారత్ కు శుభారంభం లభించింది. కెప్టెన్ రోహిత్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. మరో ఎండ్ లో శుభ్ మన్ గిల్ దడదడలాడించాడు. రోహిత్(48; 40 బంతుల్లో, 7×4, 2×6), గిల్(53; 55 బంతుల్లో, 5×4, 2×6) కదం తొక్కారు. ఈ ఇద్దరూ ఔటైనా విరాట్ విజృంభించాడు. టార్గెట్ రీచ్ చేయడం కోసం పెద్దగా స్కోరు లేకపోవడంతో కోహ్లి సెంచరీ చేస్తాడా లేదా అని అభిమానుల్లో సంశయం ఏర్పడింది. 42వ ఓవర్ తొలి రెండు బాల్స్ ను వదిలేసిన విరాట్.. 97 వద్ద ఉండగా మూడో బంతిని సిక్సర్ గా మలిచి అటు సెంచరీ కంప్లీట్ చేసుకోవడంతోపాటు భారత్ కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాడు. ఛేదనలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. సెంచరీతో జట్టును గెలుపుతీరాలకు చేర్చిన విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.