టీ20 సిరీస్ ను 4-1తో గెలిచి ఊపు మీదున్న టీమ్ఇండియా.. ఇంగ్లండ్ పై వన్డేల్లోనూ బోణీ కొట్టింది. నాగపూర్(Nagpur)లో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. కెప్టెన్ బట్లర్(52), బెథెల్(51) హాఫ్ సెంచరీలు చేయగా ఫిల్ సాల్ట్(43), డకెట్(32) రాణించారు. చివర్లో ఆడేవారు లేక ఆ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లతో ఇంగ్లండ్ నడ్డివిరిచారు. షమి, అక్షర్, కుల్దీప్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్.. గిల్(87; 96 బంతుల్లో 14×4), శ్రేయస్ అయ్యర్(59; 36 బంతుల్లో 9×4, 2×6), అక్షర్(52) నిలకడతో సునాయాసంగా విజయం సాధించింది. ముఖ్యంగా ఉన్నంతసేపూ అయ్యర్ అదరగొట్టాడు. రోహిత్(2), జైస్వాల్(15) త్వరగానే ఔటయ్యారు. నాలుగో వికెట్ కు అయ్యర్, అక్షర్ జోడీ 108 పరుగుల భాగస్వామ్యంతో గెలుపు సులువైంది. 38.4 ఓవర్లలోనే 6 వికెట్లకు 251 స్కోరు చేసిన రోహిత్ సేన.. 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించి 3 వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.