
క్రికెట్ పసికూన నేపాల్.. అగ్రశ్రేణి భారత జట్టుకు గట్టి పోటీనిచ్చింది. ఆసియా కప్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో టీమ్ఇండియా బౌలర్లను ఆ జట్టు బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ నేపాల్ కు బ్యాటింగ్ అప్పగించాడు. 48.2 ఓవర్లలో ఆ జట్టు 230 పరుగులకు ఆలౌట్ అయింది.
ఓపెనర్లు కుషాల్ భూర్తెల్(38; 25 బంతుల్లో, 3×4, 2×6), ఆసిఫ్ షేక్(58; 97 బంతుల్లో, 8×4) శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 65 రన్స్ జోడించిన తర్వాత కుషాల్ ఔటయ్యాడు. 132 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జట్టును సోంపాల్ కామి(48) ఆదుకున్నాడు. దీపేంద్ర సింగ్ అయిరి(29), గుల్షాన్ ఝా(23) రాణించారు. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. షమి, పాండ్య, శార్దూల్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. నేపాల్ ఇన్నింగ్స్ లో వర్షం మూడు సార్లు అంతరాయం కలిగించింది.
వరుణుడి ప్రభావంతో భారత్ లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం 23 ఓవర్లలో 145 రన్స్ టార్గెట్ గా డిసైడ్ చేశారు. వికెట్ కోల్పోకుండానే టీమ్ఇండియా 20.1 ఓవర్లలో 147 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(74; 59 బంతుల్లో, 6×4, 5×6), శుభ్ మన్ గిల్(67; 62 బంతుల్లో, 8×4, 1×6) నేపాల్ బౌలర్లను ఆటాడుకున్నారు. ఇండియా ఇన్నింగ్స్ లోనూ వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించింది. రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. నేపాల్ పై విజయంతో భారత్ సూపర్-4 దశకు చేరుకుంది. గ్రూప్-A నుంచి భారత్, పాకిస్థాన్ సూపర్-4 లెవెల్ కు చేరుకున్నాయి.