చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కు భారత జట్టు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. దాయాది దేశాన్ని ఏ దశలోనూ కోలుకోకుండా చేసి 228 పరుగుల భారీ రన్స్ తో విజయఢంకా మోగించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 రన్స్ చేసింది. రిజర్వ్ డే నాడు కూడా వర్షం రావడంతో కాసేపు ఆట డిస్టర్బ్ అయింది. దీంతో పాక్ జట్టు 357 పరుగుల లక్ష్యాన్ని 32 ఓవర్లలోనే ఛేదించాల్సి వచ్చింది. ఏ దశలోనూ టార్గెట్ రీచ్ చేసేలా కనిపించని పాకిస్థాన్.. టపటపా వికెట్లు రాల్చుకుంది. తొలుత కోహ్లి, రాహుల్ సెంచరీలతో ఆడుకుంటే.. 5 వికెట్లతో కుల్దీప్ మాయ చేశాడు. దీంతో ఆ జట్టు 128కే 8 వికెట్లు కోల్పోగా… చివరి ఇద్దరు నసీమ్, రవూఫ్ బ్యాటింగ్ కు దిగే అవకాశం లేక పాక్ కథ క్లోజ్ అయింది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో భారత ప్లేయర్స్ రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్.. తర్వాత బౌలర్లు దాయాది దేశం భరతం పట్టారు. నిన్న వర్షం కారణంగా వాయిదా పడి ఈరోజు రిజర్వ్ డే నాడు సాగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి(122 నాటౌట్; 94 బంతుల్లో, 9×4, 3×6), కేఎల్ రాహుల్(111 నాటౌట్; 106 బంతుల్లో, 12×4, 2×6) దుమ్ముదులిపారు. రోహిత్(56; 49 బంతుల్లో, 6×4, 4×6), గిల్(58; 52 బంతుల్లో, 10×4, 4×6) ఆదివారం నాడు రాణించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా బ్యాటర్లు అందించిన స్ఫూర్తితో మన బౌలింగ్ దళం విరుచుకుపడింది. ముఖ్యంగా 11 నెలల విరామం తర్వాత బుమ్రా పాత ఆటతీరును చూపించాడు. అతడి బౌలింగ్ లో ఆడటమే కష్టమైంది పాక్ ఆటగాళ్లకు. ఓపెనర్లు ఇమామ్-ఉల్-హక్, ఫకర్ జమాన్ తీవ్ర ఇబ్బందులు పడగా… బుమ్రా, సిరాజ్ ధాటికి 12 బంతుల వరకు ఖాతానే తెరవలేకపోయాడు జమాన్. స్వింగ్ మాయతో ఆఫ్ సైడ్ లో బుమ్రా వేసిన బాల్స్ కు పాక్ బ్యాటర్ల నుంచి జవాబు లేకపోగా.. ఫస్ట్ 10 ఓవర్స్ లో ఆ జట్టు 1/42 రన్స్ చేయగలిగింది. ఈ దశలో వర్షం అడ్డుపడింది.
ఇమామ్ ను బుమ్రా ఔట్ చేస్తే బాబర్ ను పాండ్య బౌల్డ్ చేశాడు. ఇక కంటిన్యూగా పాక్ వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా కుల్దీప్ తన బౌలింగ్ తో ఏ పాక్ బ్యాటర్ ను స్వేచ్ఛగా ఆడకుండా చేశాడు. ఫకర్(27), ఇమామ్(9), బాబర్(10), రిజ్వాన్(2), సల్మాన్(23), ఇఫ్తికార్(23), షాదాబ్(6) ఇలా అందరూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు. బుమ్రా, పాండ్య, శార్దూల్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. రన్స్ పరంగా వన్డేల్లో భారత జట్టుకు ఇదే అత్యంత పెద్ద విజయం. విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.