ఆసియాకప్ సూపర్-4 దశలో తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై జోరు చూపించిన భారత ఆటగాళ్లు.. శ్రీలంకతో మ్యాచ్ లో నీరుగారిపోయారు. ఒకానొక దశలో మ్యాచ్ పూర్తి రసవత్తరంగా సాగింది. ధనుంజయ డిసిల్వా, వెల్లలగె పోరాటంతో చేజారుతుందనుకున్న మ్యాచ్ ను టీమ్ఇండియా అతి కష్టం మీద దక్కించుకుంది. పాక్ పై 5 వికెట్లు తీసిన కుల్దీప్.. ఈ మ్యాచ్ లోనూ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసి భారత్ తడబడగా.. చివరకు ప్రత్యర్థిని సైతం అదే తీరుగా ఔట్ చేసి 41 రన్స్ తేడాతో గెలుపొందింది. శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలగె 5, చరిత్ అసలంక 4 వికెట్లతో విజృంభించడంతో టీమ్ఇండియా తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. పాక్ తో చూపించిన పోరాటం ఈ మ్యాచ్ లో రోహిత్ మినహా ఏ ఒక్కరిలోనూ కనపడలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ(53; 48 బంతుల్లో, 7×4, 2×6) మరోసారి శుభారంభం అందించాడు. అయితే మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ దారి పట్టడంతో మన జట్టు 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంకను 41.3 ఓవర్లలో 172 రన్స్ కు కట్టడి చేసి సూపర్-4లో కంటిన్యూగా రెండో విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా.. గిల్(19), విరాట్(3) త్వరత్వరగా ఔటయ్యారు. రోహిత్, గిల్ ను వెల్లలగె బౌల్డ్ చేయగా.. ఇషాన్ కిషన్(32), కేఎల్ రాహుల్(39) నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. వెల్లలగె, అసలంక పోటాపోటీగా వికెట్లు తీయడంతో భారత బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ముఖ్యంగా అసలంక 9 ఓవర్లలో 18 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా, మహీశ్ తీక్షణకు ఒక వికెట్ దక్కింది. ఏ ఒక్కరూ ఆశించిన పార్ట్నర్ షిప్ నమోదు చేయకపోవడంతో లంక ముందు భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. అనంతరం 214 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన లంక.. తొలి నాలుగు వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. స్కోరు బోర్డుపై 25 పరుగులు చేరాయో లేదో 3 వికెట్లు పడ్డాయి. పథున్ నిశాంక(6), దిముత్ కరుణరత్నే(2), కుశాల్ మెండిస్(15), సదీర సమరవిక్రమ(17), చరిత్ అసలంక(22) వరుసగా పెవిలియన్ దారి పట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ దసున్ శానక(9) కూడా తక్కువ స్కోరుకు వెనుదిరగడంతో 99 పరుగులకే శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్నట్లు కనిపించింది.
బౌలింగ్ లో ప్రతాపం చూపించిన వెల్లలగె బ్యాటింగ్ లోనూ కీలక సమయంలో రాణించాడు. వెల్లలగె(42 నాటౌట్)తో కలిసి ధనుంజయ డిసిల్వా(41) శ్రీలంకను గెలుపు దిశగా తీసుకెళ్లాడు. ఏడో వికెట్ కు 52 బాల్స్ లోనే ఈ జోడీ హాఫ్ సెంచరీ పార్ట్నర్ షిప్ అందించింది. బాల్స్ ఎక్కువగా ఉండటం, టార్గెట్ కరుగుతూ పోయిన టైమ్ లో ఒకరకంగా లంక విజయం వైపు దూసుకెళ్తున్నట్లే కనిపించింది. ఇద్దరూ ధాటిగా ఆడుతున్న వేళ జడేజా ఆ జట్టును దెబ్బతీశాడు. భారీ షాట్ కు యత్నించిన ధనుంజయ క్యాచ్ అవుట్ కావడంతో భారత జట్టులో ఆశలు చిగురించాయి. పాండ్య ఓవర్ లో సూర్య కళ్లు చెదిరే క్యాచ్ తో తీక్షణ(2) ఔటయ్యాడు. ఆ వెంటనే రజిత(1), పతిరణ(0)ను కుల్దీప్ బౌల్డ్ చేయడంతో లంక ఇన్నింగ్స్ ముగిసింది. జడేజా, బుమ్రా రెండేసి చొప్పున.. సిరాజ్, పాండ్య ఒక వికెట్ చొప్పున తీసుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన లంక స్పిన్నర్ దునిత్ వెల్లలగె ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. లంకపై విజయంతో భారత్ ఫైనల్ కు చేరుకుంది. ఆసియా కప్ టోర్నీలో టీమ్ఇండియా ఫైనల్ కు చేరడం ఇది పదోసారి కావడం విశేషం.