
తొలి ఓవర్ నాలుగో బాల్ కే వికెట్..
రెండో ఓవర్ మూడో బంతికి మరో వికెట్..
అదే ఓవర్ చివరి బాల్ కు మరో వికెట్.
స్కోరు బోర్డుపై చేరిన రన్స్ 2 అయితే పడ్డ వికెట్లు 3.
అసలే చెన్నై చెపాక్ స్టేడియం.. స్పిన్నర్లతోపాటు సీమర్లకూ అనుకూలిస్తున్న పిచ్ పై 200 టార్గెట్ కొడతారా అన్న ఆందోళన. కానీ విరాట్ కోహ్లి, KL రాహుల్ ‘హీరో’చిత ఇన్నింగ్స్ తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ను విజేతగా నిలిపారు. టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్న ఆసీస్.. 49.3 ఓవర్లలో 199 రన్స్ కు ఆలౌటయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ఇండియా.. కోహ్లి(85; 116 బంతుల్లో 6×4), రాహుల్(97 నాటౌట్; 115 బంతుల్లో 8×4 2×6) పోరాటంతో ఘన విజయం సాధించింది. 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 రన్స్ చేసి 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
ముచ్చటగా ముగ్గురు డకౌట్
ఇషాన్ కిషన్(0), రోహిత్(0), శ్రేయస్(0).. ఇలా ముగ్గురు డకౌట్ అయ్యే టైమ్ కు విరాట్ సైతం పరుగులేమీ చేయకుండానే క్రీజులో ఉన్నాడు. ఇలా 3 వికెట్లు పడ్డప్పడు స్కోరు బోర్డుపై కనిపించిన ఆ రెండు రన్స్ సైతం ఎక్స్ ట్రా రూపంలో వచ్చినవే. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ ను మార్ష్ వదిలేయడంతో కోహ్లికి లైఫ్ లభించింది. షార్ట్ బాల్ ను పుల్ చేయగా అది లెగ్ సైడ్ వైపు గాల్లోకి లేచింది. క్యాచ్ కోసం మార్ష్ తోపాటు కీపర్ క్యారీ పోటీపడ్డా అది మార్ష్ చేతుల్లో పడినట్లే పడి మిస్ అయింది. అప్పటివరకు టెన్షన్ గా ఉన్న ప్లేయర్లు, అభిమానులు క్యాచ్ మిస్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ.. స్టార్టింగ్ లో భారత జట్టు పడ్డ అవస్థలు. 6 నుంచి 14 ఓవర్ల మధ్యలో కేవలం ఒకే ఒక బౌండరీ మాత్రమే వచ్చిందంటే ఈ ఇద్దరూ ఎంత ఓపికతో బ్యాటింగ్ చేశారో అర్థమవుతుంది. ఇక 15వ ఓవర్ చివరి రెండు బాల్స్ కు రెండు ఫోర్లు కొట్టి కోహ్లి ఉత్సాహం నింపాడు. అటు KL సైతం బ్యాట్ కు పనిచెప్పాడు. 17వ ఓవర్లో జంపా బౌలింగ్ లో చివరి నాలుగు బాల్స్ కు మూడు ఫోర్లు కొట్టి లైన్ లో పడ్డాడు. చివరకు విరాట్ ఔటైనా తుది లాంఛనాన్ని కేఎల్ పూర్తి చేశాడు. కోహ్లి, రాహుల్ తెగువతో టీమ్ఇండియా.. వరల్డ్ కప్ లో బోణీ కొట్టింది. హేజిల్ వుడ్ కు 3 వికెట్లు పడ్డాయి.
ఒక్క హాఫ్ సెంచరీ లేని ఆసీస్
జడేజా, కుల్దీప్, అశ్విన్ స్పిన్ త్రయానికి ఆస్ట్రేలియా అపసోపాలు పడింది. 49.3 ఓవర్లలో 199 రన్స్ కు ఆలౌటయింది. కంగారూ టీమ్ లో ఏ ఒక్కరూ హాఫ్ సెంచరీ మార్క్ ను చేరుకోలేదు. ఓపెనర్ మిచెల్ మార్ష్(0) బుమ్రా బాల్ కు డకౌట్ కాగా.. ఫామ్ కొనసాగిస్తున్న మరో ఓపెనర్ వార్నర్(41) ఫర్వాలేదనిపించాడు. స్లిప్ లో కోహ్లి అద్భుతంగా డైవ్ చేసి మార్ష్ క్యాచ్ అందుకున్నాడు. స్మిత్(46)తో కలిసి రెండో వికెట్ కు 69 రన్స్ జోడించిన అనంతరం వార్నర్ ను కుల్దీప్ ఔట్ చేశాడు. కొద్ది సేపు క్రీజులో నిలిచిన లబుషేన్(27) సైతం పెద్దగా స్కోరు చేయకుండానే వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా రన్ రేట్ 4కే పరిమితం కాగా.. కొన్ని ఓవర్లలో మాత్రమే 5కు చేరుకుంది. స్మిత్, లబుషేన్, అలెక్స్ క్యారీ(0) ముగ్గురినీ జడేజా ఔట్ చేశాడు. మ్యాక్స్ వెల్(15) ను కుల్దీప్, గ్రీన్(8)ని అశ్విన్ బుట్టలో వేసుకున్నారు. 4 వికెట్లకు 119 స్కోరుతో కనిపించిన కంగారూ జట్టు… 140కి చేరుకునే సరికి 7 వికెట్లు చేజార్చుకుంది. మెయిన్ బ్యాటర్లంతా ఒకరి వెంట మరొకరు క్యూ కట్టడంతో ఆస్ట్రేలియా నుంచి ప్రతిఘటనే లేకుండా పోయింది. కమిన్స్(15), స్టార్క్(28) చివర్లో భారత బౌలర్లను కాసేపు అడ్డుకున్నారు. రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకోగా.. కుల్దీప్, బుమ్రా రెండేసి వికెట్ల చొప్పున, అశ్విన్, పాండ్య, సిరాజ్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. రాహుల్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
Congratulations team India
Congratulations india.
Content explained very well .