న్యూజిలాండ్(New Zealand)తో జరిగిన మ్యాచ్ లో భారత యువ ప్లేయర్లు అదరగొట్టారు. అండర్-19 ప్రపంచకప్(World Cup)లో భాగంగా బ్లూమ్ ఫౌంటేన్ లో జరిగిన వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 295 పరుగులు చేసింది. అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ కుర్రాళ్లు టపటపా వికెట్లు చేజార్చుకున్నారు. 28.1 ఓవర్లలో 81 స్కోరుకే ఆలౌటై 214 పరుగులు భారీ తేడాతో భారత్ కు మ్యాచ్ సమర్పించుకున్నారు.
సెంచరీ సహా ఆల్ రౌండ్ తో ముషీర్…
టీమ్ఇండియా బ్యాటింగ్ లో ముషీర్ ఖాన్(131; 126 బంతుల్లో, 13×4, 3×6) సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ బౌలర్లు తేలిపోయారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్(52) హాఫ్ సెంచరీ సాధిస్తే కెప్టెన్ ఉదయ్ సహరన్(34) సహకారమందించాడు. కివీస్ బౌలర్లలో మాసన్ క్లార్క్ 4 వికెట్లు తీసుకున్నాడు.
కుప్పకూలిన కివీస్…
మంచి టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ ను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. సామీ పాండే 4 వికెట్లతో న్యూజిలాండ్ నడ్డి విరిస్తే ముషీర్, రాజ్ లింబాని చెరో రెండు వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించారు. తొలుత బ్యాటింగ్ లో సెంచరీతో ఆకట్టుకున్న ముషీర్.. బౌలింగ్ లోనూ అదరగొట్టాడు. ఓపెనర్లు టామ్ జోన్స్(0), జేమ్స్ నీల్సన్(10), స్నేహిత్ రెడ్డి(0), స్టాక్ పోల్(5), కెప్టెన్ ఆస్కర్ జాన్సన్(19), ఒలివర్ తెవాతియా(7), జాక్ కమింగ్(16) పెద్దగా ఆడకుండానే పెవిలియన్ చేరుకున్నారు. దీంతో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించిన యువ టీమ్ఇండియా 6 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉంది.
Published 30 Jan 2024