టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత సెంచరీతో స్టేడియంను ఉర్రూతలూగించాడు. ఇంగ్లండ్ తో రెండో వన్డేలో అతడి పోరాటం భారీ టార్గెట్ ను ఈజీ చేసింది. తొలుత గిల్(60)తో కలిసి తొలి వికెట్ కు 136 పరుగులు జత చేశాడు. హాఫ్ సెంచరీని 30 బంతుల్లో పూర్తి చేసిన అతడు సెంచరీకి మరో 46 బాల్స్ తీసుకున్నాడు. రోహిత్ సెంచరీ(119)లో 12 ఫోర్లు, 7 సిక్సులున్నాయి. వన్డేల్లో అతడికి ఇది 32వ సెంచరీ. 96 వద్ద ఉన్నప్పుడు ఆదిల్ రషీద్ బౌలింగ్ లో సిక్సు బాది శతకం(Hundred) పూర్తి చేసుకున్నాడు. 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఓపెనర్ సెంచరీ సాధించాడు.
తొలుత ఇంగ్లండ్ 304కు ఆలౌట్ కాగా, భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది భారత్. కోహ్లి(5) ఆడకున్నా, అయ్యర్(44) రోహిత్ కు అండగా నిలిచాడు. రాహుల్(10), పాండ్య(10) ఔటైనా అక్షర్(41 నాటౌట్) చివరి వరకూ పట్టుదల చూపి విజయాన్ని అందించాడు. 44.3 ఓవర్లలో 6 వికెట్లకు 308 రన్స్ చేసిన భారత్.. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత్ గెలుచుకుంది. టీ20, వన్డే సిరీస్ ల్ని టీమ్ఇండియాకు అప్పగించింది ఇంగ్లండ్.