భారత టాప్ చెస్ ప్లేయర్ గా గ్రాండ్ మాస్టర్ డి.గుకేశ్ అవతరించాడు. సుమారు 37 ఏళ్ల పాటు భారతీయ చదరంగ రారాజుగా ఆధిపత్యం కొనసాగించిన మేటి క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ కు గుకేశ్ చెక్ చెప్పాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ గా నిలిచిన ఈ చెన్నై కుర్రాడు.. 17 వయసులోనే అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. అటు యువ సంచలనం ప్రజ్ఞానంద ఫిడే రేటింగ్స్ లో 19వ స్థానాన్ని ఆక్రమించాడు. 2,754 ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచంలో ఆనంద్ తొమ్మిదో ప్లేస్ లో నిలవగా.. అతడికన్నా నాలుగు పాయింట్లు ఎక్కువగా 2,758తో గుకేశ్ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక 2,727 పాయింట్లతో ఆర్.ప్రజ్ఞానంద 19వ స్థానంలో ఉన్నాడు.
2023 ఏడాదికి గాను ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ విడుదల చేసిన జాబితా టాప్-30లో విదిత్ సంతోష్ గుజ్రాతి, అర్జున్ ఎరిగాసి నిలిచారు. మొత్తం 100 మంది బెస్ట్ ప్లేయర్లతో కూడిన లిస్ట్ ను చెస్ ఫెడరేషన్ ప్రకటించింది. నార్వేకు చెందిన గ్రాండ్ మాస్టర్, ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ 2,839 పాయింట్లతో టాప్-1 స్థానాన్ని ఆక్రమించాడు. అమెరికాకు చెందిన ఇద్దరు ప్లేయర్లు కరువానా ఫెబియానో(2,786), నకముర హికారు(2,780) సెకండ్, థర్డ్ పేస్ ల్లో ఉన్నారు. 2,716 పాయింట్లతో విదిత్ 27వ స్థానంలో, 2,712 పాయింట్లతో ఎరిగాసి అర్జున్ 29వ ప్లేస్ ను దక్కించుకున్నారు. పెంటేల హరికృష్ణ 31, నిహాల్ శరీన్ 43, ఎస్.ఎల్.నారాయణ్ 82, వి.ఆర్.అరవింద్ చితాంబరం 91 స్థానంలో నిలిచారు. మొత్తంగా ఇండియా ప్లేయర్ల ర్యాంకుల్ని పరిశీలిస్తే టాప్-10లో ఇద్దరు, టాప్-20లో ముగ్గురు, టాప్-30లో ఐదుగురు, టాప్-50లో ఏడుగురు, టాప్-100లో తొమ్మిది మంది స్థానాల్ని నిలుపుకొన్నారు.