ట్యునీషియా క్రీడాకారిణి జాబెర్… అద్భుత పోరాటంతో వింబుల్డన్ ఫైనల్(Final) కు చేరుకుంది. మహిళల సింగిల్స్ గురువారం ఆమె 6-7 (5-7), 6-4, 6-3 తేడాతో రెండో సీడ్ సబలెంక(బెలారస్)పై విజయం సాధించింది. వీరిద్దరూ హోరాహోరీగా పోరాడటంతో తొలి సెట్ లో పోటాపోటీగా మారింది. ఏ ఒక్కరూ బ్రేక్ సాధించలేకపోవడంతో టై బ్రేకర్ కు దారితీసింది. అందులోనూ పోరు రసవత్తరంగా సాగినా సబలెంకకు జాబెర్ సెట్ కోల్పోవాల్సి వచ్చింది. జోరైన ఆటతీరుతో అలరించిన సబలెంక ఫైనల్లో అడుగుపెడుతుందని అంతా భావించారు. అటు రెండో సెట్ లోనూ సబలెంక దూకుడు ప్రదర్శించి 4-2తో నిలిచింది. ఈ దశలో పూర్తిగా ఆశలు అడుగంటిన సమయంలో జాబెర్ విశ్వరూపం ప్రదర్శించింది. వరుసగా నాలుగు గేమ్ లు గెలిచి ఆ సెట్ ను సొంతం చేసుకుంది. ఇక మూడో సెట్ లోనూ చెలరేగిన ఈ ట్యునీషియా ప్లేయర్.. మూడో సెట్ లో విజృంభించి మరీ ఆడింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా టాప్ క్లాస్ ఆటతో ఆకట్టుకుంది.
టాప్ సీడ్ ప్లేయర్స్ కి ఝలక్ ఇచ్చి సెమీస్ చేరిన ఎలీనా స్వితోలినా(ఉక్రెయిన్)ను మార్కెటా వొండ్రుసోవా(చెక్ రిపబ్లిక్) ఓడించింది. వొండ్రుసోవా ఫైనల్ లో జాబెర్ తో తలపడుతుంది. వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ సెమీస్ లో ఎనిమిదో సీడ్ సిన్నర్(ఇటలీ)తో రెండో సీడ్ జకోవిచ్(సెర్బియా) తలపడతారు. మరో సెమీస్ లో టాప్ సీడ్ అల్కరాస్(స్పెయిన్)తో మూడో సీడ్ మెద్వదేవ్(రష్యా) పోటీ పడనున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన జకోవిచే సెమీస్ లో ఫేవరేట్ గా కనిపిస్తున్నాడు.